మూసాపేట, మే 6 : దేవరకద్ర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు రైతులు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని, స్వయంగా వాహనాలను పట్టించినా ఫలితం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. చీకటి పడిందంటే వాగులో జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక మాఫియా హల్చల్ చేస్తున్నది. రాత్రికి రాత్రే వాగులను గుల్ల చేస్తున్నారు. ఒక్కో గ్రామంలో పదుల సంఖ్యల వా హనాలతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. అక్రమార్కులు అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తుండగా, పేదలు ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలకు కూడా సరిపడా ఇసుకను అందించడం లేదని వాపోతున్నారు.
తోడేస్తున్నారు..
దేవరకద్ర నియోజకవర్గకేంద్రంతోపాటు, కౌకుంట్ల, చిన్నచింతకుంట, మూసాపేట, అడ్డాకుల తదితర మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. ఆయా గ్రామాల్లో ఇసుక తరలిపోవడంతో వ్యవసాయ బోరుబావులు ఎండిపోయి నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పూర్తి ఆధారాలతో వీడియోలు, చిత్రాల ను చూయించినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్ర జలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కలెక్టర్ రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. కానీ కలెక్టర్ ఆదేశాలు కూడా బేఖాతరు చేస్తున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.