ఊట్కూర్ : తెలంగాణలో అధిక జనాభా ఉన్న ముదిరాజులు ( Mudiraj ) అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకటేష్ ( President Venkatesh) , జిల్లా అధ్యక్షుడు ఎన్ రాఘవేంద్ర అన్నారు. నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (MEPA) సమావేశంలో వారు మాట్లాడారు.
పాలకుల నిర్లక్ష్యంతో ముదిరాజులు వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముదిరాజులు విద్య, ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. రాష్ట్రంలో ఒకే ఒక్క ఎమ్మెల్యే స్థానంలో గెలుపొందిన ముదిరాజు బిడ్డకు మంత్రి పదవి ఇవ్వటానికి వెనుకాడుతున్నారని ఆరోపించారు. ముదిరాజులను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు.
వెనుకబాటుకు గురైన ముదిరాజుల హక్కులను సాధించుకోవడంతో పాటు జిల్లా వ్యాప్తంగా వివిధ రంగాల్లో ప్రతిభ చాటిన ముదిరాజు బిడ్డలను వెన్ను తట్టి ప్రోత్సహించేందుకు మెపా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇటీవల పదో తరగతి, ఇంటర్ అత్యధిక మార్కులు సాధించిన వారికి, వివిధ ప్రభుత్వ కొలువులు సాధించిన యువతకు జిల్లా కేంద్రంలో సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు.
కార్యక్రమంలో మెపా మండల బాధ్యులు జె కరుణాకర్, జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, సలహా సమితి సభ్యులు నారాయణ, ఎం భరత్, కృష్ణ, దొబ్బలి హనుమంతు, జి రమేష్, కనకప్ప, రమేష్, సుమన్, రోషినప్ప, పి నారాయణ పాల్గొన్నారు.