ఊట్కూర్ : నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఎత్తిపోతల పథకం ( Lift Irrigation ) కింద భూములు కోల్పోతున్న రైతులందరికీ తగిన పరిహారం (Compensation) అందించి న్యాయం చేస్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ( MLA Vakiti Srihari ) అన్నారు. మక్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి ఊట్కూర్ పెద్ద చెరువుకు సాగు నీటిని తరలించేందుకు ఓపెన్ కెనాల్ ( Open Canal ) నిర్మాణంలో భాగంగా వ్యవసాయ భూములు కోల్పోతున్న దంతన్ పల్లి శివారు రైతులు ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన వ్యవసాయ భూములను కోల్పోతే భవిష్యత్తులో తమ కుటుంబాలకు బతుకుదెరువు కష్టతరమవుతుందని వివరించారు. తమ కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారమని వాపోయారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారం ఎంత అందిస్తారనే విషయాన్ని అధికారులు ఇప్పటి వరకు తమకు చెప్పడం లేదన్నారు. భూములు కోల్పోతున్న కుటుంబాలను ఆదుకునేందుకు కుటుంబంలో చదువుకున్న యువకులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు.
ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్‌ను దృష్టిలో ఉంచుకుని న్యాయబద్ధమైన పరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే కొడంగల్ లగచర్ల ఇండస్ట్రీ ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులకు ఎంతైతే పరిహారం అందిస్తారో మక్తల్ రైతులకు అంతే సమానంగా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తామని భరోసా కల్పించారు.
ప్రాజెక్టు నిర్మాణంతో లక్షకు పైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని, ఈ ప్రాంతం పచ్చబడుతుందని రైతులతో పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు యజ్ఞేశ్వర రెడ్డి, సీనియర్ నాయకుడు ఎల్కోటి జనార్ధన్ రెడ్డి, రైతులు మొట్కార్ గోపాల్ రెడ్డి, శెట్టి రమేష్, సురేందర్ రెడ్డి, మోహన్ రెడ్డి, దొబ్బలి రవి, సంజనోళ్ళ భాస్కర్, అనీల్ రెడ్డి, సంజప్ప, నంద కిషోర్, తరుణ్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రామ్‌రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.