నాగర్ కర్నూల్ రూరల్ : నాగర్ కర్నూల్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్( Education hub) గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాననని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy ) పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిచాక 18 నెలల కాలంలోనే కళాశాలను మూడు నాలుగుసార్లు సందర్శించానన్నారు
. మొదటిసారి కళాశాలను సందర్శించినప్పుడు కళాశాల భవనం శిథిలావస్థకు చేరి వర్షపు నీరు తరగతి గదులలోకి కురుస్తుందని, కప్పు పెచ్చులు ఊడి విద్యార్థులు భయాందోళన చెందుతున్నారని స్థానిక ప్రిన్సిపల్ తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. కళాశాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నిధుల మంజూరికి ముఖ్యమంత్రిని కోరడంతో రూ. 9 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
కళాశాల భవన నిర్మాణాన్ని అన్ని రకాల సౌకర్యాలతో మంచి డిజైన్ ఉండేలా, జిల్లాలో ఎక్కడ లేని విధంగా చేపడతామన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు అయిందని, ఏ చదువైనా నాగర్ కర్నూల్ జిల్లాలోనే చదువుకొనేలా విద్యా కేంద్రాలు ఏర్పాటు చేపడుతామన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు ఎమ్మెల్యేను శాలువా, పూల బొకేతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ, ప్రిన్సిపాల్ మాధవి , మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు కొత్త శ్రీనివాసులు, రాజ్ కుమార్, నిజాముద్దీన్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.