మహబూబ్‌గనర్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరు నూరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి తీరుతామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వీరన్నపేట పెద్ద శివాలయాన్ని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పాలమూరు ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే గాక ఎన్జీటీ ఇచ్చిన జరిమానాపై స్టే విధించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
ఈ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పనులను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక న్యాయమైన కోరిక అన్నారు. కరువు ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో దోహదపడుతుందని చెప్పారు. సాగునీటి లభ్యత పెరిగితే జిల్లా స్వరూపమే మారుతుందన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మాణాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు.
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో లక్షల ఎకరాలకు సాగునీరు అంది సిరుల పంటలు పండుతున్నాయని పేర్కొన్నారు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టుతో ఎండాకాలంలో వాగుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తుందని వివరించారు. చెరువుల పూడికతీతతో సాగునీటి లభ్యత గణనీయంగా పెరిగిందన్నారు. ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేసిన ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి కర్షకులకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.