నారాయణ పేట్ : మదాసి కురువకు (Madasi Kuruva ) ఎస్సీ కుల పత్రాలు ఇవ్వకుంటే త్వరలో ముఖ్యమంత్రి (Chief Minister ) జరిపే జిల్లాల పర్యటనలను అడ్డుకుంటామని తెలంగాణ మదాసి కురువ, మదారి కురువ ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ ( Vijaykumar ) హెచ్చరించారు. అవసరమైతే జిల్లా మంత్రి శ్రీహరిని ( Minister Srihari ) వచ్చే ఎన్నికలలో వ్యతిరేకంగా ఓటు వేస్తామని వెల్లడించారు.
నారాయణపేట్ జిల్లాలో సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మదాసి కురువలు కలెక్టరేట్ కార్యాలయాలన్ని ముట్టడించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం అందజేశారు.
రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ మదాసి కురువలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు బేషరతుగా జారీ చేయాలని డిమాండ్ చేశారు. సుమారు రూ. 2 వందల కోట్లను కుల గణనకు వెచ్చించిన ప్రభుత్వం మదాసి కురువ కుల జనాభా బహిర్గతం చేయకూడదనే దురుద్దేశంతో కులాల వారీగా జనాభా లెక్కలు సైతం ప్రకటించకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదని ఆరోపించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మదాసి కురువ కులస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సీహెచ్ వెంకటయ్య , ప్రదాన కార్యదర్శి తిప్పన్న, నారాయణపేట తాలుకా అధ్యక్షులు బండి హనుమంతు, మక్తల్ తాలూకా అధ్యక్షులు ఒబులాపురం అంజప్ప, జిల్లా నాయకులు మోహన్. ఆశప్ప, లింగప్ప, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు బత్తుల మొగిలయ్య, రాష్ట్ర నాయకులు బండారి మల్లేష్ , వివిద మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, గ్రామ సంఘ నాయకులు పాల్గొన్నారు .