ఊట్కూర్ : సమ సమాజ స్థాపనకు, దేశ అభివృద్ధికి ఎనలేని సేవలందించిన బాబు జగ్జీవన్ రామ్ ( Jagjivan Ram ) బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్య ప్రకాష్ రెడ్డి ( Surya Prakash Reddy) , అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు కొక్కు శంకర్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని చెక్‌పోస్ట్ కూడలిలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూజలు నిర్వహించి నివాళి అర్పించారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, భారత ఉప ప్రధానిగా ఆయన ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. 1935లో దళితుల సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. జవహర్లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడని తెలిపారు.
సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన జగ్జీవన్‌రామ్ వ్యవసాయం, సమాచార, ప్రసార శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన గొప్ప రాజకీయ వేత్తని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గం శ్రీనివాస్, నారాయణ, సురేష్, ఆర్ దశరథ్, అశోక్ , భరత్, ఎల్ బలరాం, తిమ్మప్ప, జగదీష్, మల్లేష్, బాల్క సుమన్ పాల్గొన్నారు.