గట్టు, ఏప్రిల్ 11 : మండలకేంద్రంలోని బాలుర, బాలికల ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినలేక విద్యార్థులు శుక్రవారం అవస్థలు పడ్డారు. అన్నంతోపాటు ఉడికి ఉడకని టమాటతో కూడిన నీళ్ల చారును విద్యార్థులకు వడ్డించారు. ఈ నీళ్ల చారుతో అన్నం తినలేక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రుచి, శుచి లేని ఈ భోజనాన్ని విద్యార్థుల తినలేక పారబోశారు.
గత కొన్ని నెలలుగా తమకు బిల్లు రాకపోవడంతో ఈవిధంగా వండినట్లు ఏజెన్సీ వారు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లగా ఇదొక్కసారికి వదిలేయండి సార్. మళ్లీ ఇలా జరగకుండా చూస్తామని చెప్పారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ విషయంలో చొరవ తీసుకుని మధ్యాహ్న భోజనం నాణ్యతగా వండేటట్లు చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.