వీపనగండ్ల, జూలై 16 : జూరాల ప్రాజెక్టు పరిధిలోని రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి రెండు రోజులుగా నీటిని విడుదల చేస్తున్నారు. మండలంలోని గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు జూరాల నీరు చేరడంతో అన్నదాతలు, మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
0.36 టీఎంసీ కెపాసిటీ గల గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ను నింపితే ఉమ్మడి వీపనగండ్ల మండలానికి సంబంధించిన గోవర్ధనగిరి, వీపనగండ్ల, వెలగొండ, అమ్మాయిపల్లి, చిన్నదగడ, పెద్దదగడ, గూడెం, బెక్కెం, మియ్యాపూర్, గడ్డభాస్వపురం, లక్ష్మీపల్లి, కొప్పునూర్, పెద్దమారూర్, గోప్లాపూర్, కొండూరు తదితర గ్రామాల్లో దాదాపుగా 30వేల ఎకరాల్లో పంటలు పండించుకునే అవకాశం ఉన్నది.
కొంతమంది రైతులు ఇదివరకే వరి తుకాలు పోసి వరి పంట సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. మరికొంత మంది గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు నీరు చేరుతుండడంతో పంటల సాగుకు సన్నద్ధమవుతున్నారు. అయితే త్వరగా గోపల్‌దిన్నె రిజర్వాయర్‌ను నింపి సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు.