వనపర్తి, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : పక్కనే కృష్ణమ్మ పారుతున్నా సాగునీటికి నోచుకోని వనపర్తి జి ల్లాలో ప్రస్తుతం ఎక్కడ చూసినా జలవనరులు సమృద్ధిగా దర్శనమిస్తున్నాయి. ఏ మారుమూల ప్రాంతానికి వెళ్లినా పచ్చని పంటలు కళకళలాడుతున్నాయి. సమైక్య పాలన లో బీటలు వారిన నేలలు నేడు పచ్చదనంతో పలుకరిస్తున్నాయి. వ్యవసాయం దండుగ అన్న మాట నుంచి పం డుగ అనేలా రైతులు సంబురంగా సాగు చేస్తున్నారు. దీనికంతటికీ సీఎం కేసీఆర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి కృషి అని ప్రజలు చెబుతున్నారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు, కుంటలు బాగుచేసి.. నీటిని నిల్వ చేస్తున్నారు. దీంతో సాగునీటి కొరత తీరింది. భూ గర్భ జలాలు కూడా పెరిగి.. బోర్లు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉంటున్నది. గంగమ్మ పైపైకి ఉబికి వస్తున్నది. కాలువలు, చెరువుల్లో నీరు పారుతున్నప్పటికీ.. కొండలు, గుట్టలు, ఎగువ ప్రాంతాల్లో ఉన్న పొలాలకు సాగునీరందలేదు. ఈ క్రమంలో మంత్రి నిరంజన్‌రెడ్డి మినీ లిఫ్ట్‌లను ఏర్పాటు చేసి నీటినందించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.100 కోట్ల వ్యయంతో ఇప్పటివరకు 58 లిఫ్ట్‌లను అందుబాటులోకి తెచ్చారు. కాగా, ఖిల్లాఘణపురం మండలం కర్నెతండా ఆయకట్టుకు సాగునీరందడం లేదన్న విషయాన్ని సీఎం కేసీఆర్‌కు వివరించి రూ.72 కోట్లతో కర్నెతండా లిఫ్ట్‌ను మంజూరు చేయించారు. ఈ లిఫ్ట్‌తో గిరిజనులు సంబురంగా సాగు చేయనున్నారు. ఈ పనులను త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభించే అవకాశం ఉన్నది. ప్రభుత్వ నిధులతో కొన్ని లిఫ్ట్‌లు ఏర్పాటు చేయగా.. కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ఆర్) కింద మరికొన్నింటిని నిర్మించారు. ఇటీవల మోజర్ల వద్ద మరో లిఫ్ట్‌ను సీఎస్ఆర్ నిధులతో ప్రారంభించారు. నీళ్ల నిరంజన్‌రెడ్డి పేరును సార్థకం చేసుకుంటూ సాగునీటి కోసం సొంత డబ్బులను ఖర్చుపెడుతున్నాడు. ఎంజీకేఎల్ఐ, భీమా కాలువల ద్వారా చెరువులు నింపి.. అక్కడి నుంచి సమీపంలో లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి పైపులైన్ల ద్వారా సాగునీరందించే బృహత్తర కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతున్నది. దీంతో రెండుకార్ల పంటలను సంతోషంగా పండిస్తున్నారు.
ఆరు వేల ఎకరాలకు సాగునీరు..
మినీ లిఫ్ట్‌ల ద్వారా జిల్లాలో ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతున్నది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో 63.74 కిలోమీటర్ల పైపులైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 95 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకుగానూ పెద్దమందడి, గోపాల్పేట, రేవల్లి,
వనపర్తి, ఖిల్లాఘణపురం, శ్రీరంగాపురం, పాన్‌గల్ మండలాల్లో మినీ లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి దాదాపు 107 మోటర్లు బిగించారు. ప్రజలు కూడా లిఫ్ట్ పనులకు స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు. పంట పొ లాల్లో నుంచి పైపులైన్లు వేస్తున్నా స్వాగతిస్తున్నారు.
సెంటు జాగా కూడా బీడుగా ఉండొద్దు..
సెంటు జాగా కూడా బీడుగా ఉండొద్దు. అదే లక్ష్యంగా సాగు నీటి కో సం విశ్వప్రయత్నాలు చేశాం. సీఎం కేసీఆర్ ఆ ధ్వర్యంలో ఇప్పటికే కాలువలు, చెరువుల్లో సాగునీరు పుష్కలంగా ఉన్నది. ఇటీవల రూ.72 కోట్లతో మం జూరైన కర్నెతండా లిఫ్ట్ ప్రారంభమైతే.. నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో సాగునీరు అందినట్లే. ఇప్పటికే 1.10 లక్షల ఎకరాలకు పైగా భూమి సాగులోకి వచ్చింది. ఒకప్పుడు వలసలు వెళ్లిన వారు నేడు తిరిగి వచ్చి సంబురంగా సాగు చేస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. ఎక్కడ చూసినా పంటలు కళకళలాడుతున్నాయి. వాటిని చూస్తే పడిన కష్టమంతా మరిచిపోయి సంతోషంగా ఉంటుంది.