ఆత్మకూర్, ఏప్రిల్ 20: కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారికి ఆత్మకూరు (Atmakur) ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి దామోదర రాజనర్సింహా ఆత్మకూరు దవాఖానలో డయాలసిస్ సెంటర్ను ప్రారంభించారు. అయితే యంత్రపరికరాలు అందుబాటులో లేకపోవడంతో రోగులకు సేవలు నిలిచిపోయాయి. ఈ విషయం ఎమ్మెల్యే శ్రీహరికి రావడంతో.. ఆయన సొంతంగా రూ.25 లక్షలు వెచ్చించి యంత్ర పరికరాలతోపాటు ఓ కంటైనర్ను సమకూర్చారు. హాస్పిటల్ ఆవరణలో నూతన భవన నిర్మాణం జరిగే వరకు కంటైనర్లో డయాలసిస్ రోగులకు రక్తమార్పిడి సేవలు అందించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రహమతుల్లా, నల్లగొండ శ్రీనివాసులు, మణి వర్ధన్ రెడ్డి వెల్లడించారు. డయాలసిస్ సేవలు అందించే ఏర్పాట్లలో భాగంగా కంటైనర్ను ఆత్మకూరు ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.