మాగనూరు : మన ఇసుక- మన వాహనం పేరుతో నారాయణపేట జిల్లా ( Narayanapeta District ) మాగనూర్ మండలం గజరం దొడ్డి, మంది పల్లి శివారులో ఉన్న పెద్దవాగులో ఇసుకను అక్రమంగా తరలిస్తూ వాల్టా చట్టానికి (WALTA Act ) తూట్లు పొడుస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాగులో హిటాచీతో టిప్పర్ లోడింగ్ చేస్తున్నారు.
వాల్టా చట్టం ప్రకారం వాగులో లేబర్ పెట్టి ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేసి ట్రాక్టర్లు తరలించాల్సి ఉండగా వాల్టా చట్టానికి విరుద్ధంగా హిటాచీ పెట్టి ఆరు ట్రిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలించి లాభాలు పొందుతున్నారు. హిటాచీలు పెట్టి వాగు లోతుగా గుంతలు తవ్వుతున్న మైనింగ్, రెవిన్యూ అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాగులో లోతుగా తొవ్వడం ద్వారా రైతులకు సాగునీరు కోసం బోర్లకు నీరు అందడం లేదని గజరం దొడ్డి రైతులు వాపోయారు. ఈ విషయంపై మాగనూర్ మక్తల్ సంబంధిత అధికారులకు తెలియజేసినా ఏ ఒక్కరు పట్టించుకోకపోవడంతో నారాయణపేట జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
అనుమతి మక్తల్ శివారులో ఉంటే మాగనూర్ శివారులో ఇసుక తీస్తున్నారని దీనిపై మైనింగ్ శాఖ అధికారులు కూడా స్పందించకపోవడం దారుణమని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్న వారిపై చట్టపర చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని స్థానికులు కోరుతున్నారు.