రాజోళి మండల ప్రజలు భయం నీడలో బతుకు తున్నారు. ఇథనాల్ చిచ్చు రాజుకోగా.. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో అని జంకుతున్నారు. ఇప్పటికే 40 మందిపై కేసులు నమోదు చేయడంతోపాటు 12 మంది రైతులను రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో కంటిమీద కునుకు లేకుండా 12 గ్రామాల వాసులు కాలం వెల్లదీస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా.. ఎంత మందిని అరెస్టు చేసినా.. జైళ్లో పెట్టినా.. ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతామని హెచ్చరిస్తున్నారు.
గద్వాల, జూన్ 5 : ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలు భయం, భ యంతో కాలం గడుపుతున్నారు. ఇంకా ఎంతమందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారోనని ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ప్రజలపై చేసిన కేసుల్లో ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని దాడుల్లో పాల్గొన్న ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఆందోళన అనంతరం గ్రామాల్లో నిశబ్ద వాతావరణం నెలకొంది.
గురువారం ప్రింట్, సోషల్ మీడియాలో రాజోళి ఎస్సై మాట్లాడిన మాటలు రైతులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. తాము శాంతియుతంగా ఆందోళన చేస్తే మహిళలు కారంపొడి తీసుక వచ్చి ఆందోళన చేశారని పచ్చి అబద్ధాలు మీడియాలో మా ట్లాడడంపై ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తున్న ప్రజలు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల పక్షాన నిలబడాల్సిన పోలీసులు యాజమాన్యం వైపు నిలబడి తమపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు.
ఆందోళనలో పాల్గొనని వారి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో ఉద్దేశ పూర్వకంగా నమోదు చేయడంతో ప్రజలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారు. పోలీసుల మాట తీరు వల్ల చిన్నధన్వాడ, పెద్దధన్వాడ, నసనూర్, మాన్‌దొడ్డి, నౌరోజీక్యాంప్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఏదో పెద్ద నేరం చేసినట్లు 40 మంది పై కేసులు నమోదు చేయడంతోపాటు అందులో 12 మందిని రిమాండ్ చేయడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం 12 మందిని అరెస్ట్ చేయ డం, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తుండడం తో ఎప్పుడు పోలీసులు ఎవరిని అరెస్ట్ చేస్తారో నని ఆందోళన చెందుతున్నారు.
పోలీసుల తీరు వల్ల గత రెండు రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుం డా పోయింది. ప్రస్తుతం అరెస్ట్ చేసిన వారితోపాటు వీడియోలు చూస్తున్నామని ఆందోళనలో ఎవరెవరు పాల్గొన్నారో చూసి వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఎస్సై చెప్పడంతో ఆయన తీరుపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేసుకోండి, ఎంతమందిని జైల్లో పెడతారో పెట్టుకోండి అంటూ ఆయా గ్రామాల ప్రజ లు అంటున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేసినా జైలు కు పం పినా, మరింత మందిపై కేసులు నమోదు చేసి నా భయపడే ప్రసక్తి లేదని, తమ ప్రాణాలు ఫణంగా పట్టైనా ఇథనాల్ కంపెనీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని ఆయా గ్రామాల ప్రజలు హెచ్చరిస్తున్నారు. బు ధవారం జరిగినా సంఘటనపై పెద్దధన్వాడ గ్రా మం లో ప్రజలు ఒక చోటికి చేరుకొని చర్చించుకుంటున్నారు. నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలను ప్రజలు ఆసక్తిగా చూశారు.
అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించి..
ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో పాటు కంపెనీ సామగ్రి ద్వంసం చేసిన విషయంలో రాజోళి పోలీసులు 40 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 12 మందిని అరెస్ట్ చేసి గురువారం మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. బుధవారం రాత్రి, రాజోళి, మానవపాడు పోలీస్ స్టేషనల్లో ఉన్న రైతులు, ప్రజలను ఉదయం ప్రత్యేక పోలీస్ వాహనంలో గద్వాలకు తీసుక వచ్చారు. వీరికి వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరు పర్చి అటు నుంచి మహబూబ్‌నగర్ జైలుకు తరలించారు. రిమాండ్ చేసిన వారిలో పెద్దదన్వాడ, చిన్నధన్వాడ గ్రామాలకు చెం దిన కుర్వ నర్సింహులు, నరసింహులు, భరత్‌కుమార్, చిన్ననాగేంద్ర, నల్లబోతు కాటం, పరశురాముడు, శివగౌడ్, సూర్యప్రకాశ్, తిప్పారెడ్డి, భీమన్న, మనోహర్, ఏసన్న తదితరులు ఉన్నారు.
వద్దంటే లాఠీలతో కొడ్తారా..?
మా పచ్చని పంటలను నాశనం చేసే ఇథనాలు ఫ్యాక్టరీ మాకొద్దంటూ ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు ఆందోళన చేస్తావా? అని అక్కడి నుంచి డీసీఎం వద్దకు ఎత్తుకెళ్లి లాఠీతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. దీంతో తొడలు కందిపోయాయి. తాను డీసీఎం ఎక్కకపోతే నలుగురు పోలీసులు ఎత్తుకెళ్లి డీసీఎంలో పడేశారు. నేనేమి తప్పు చేశానని ప్రశ్నిస్తే కొడుతున్నారు. న్యాయం అడిగితే పోలీసులు కొట్టడం ఏమిటీ? దీన్నిబట్టి కంపెనీకి పోలీసులు వత్తాసు పలుకుతున్నట్లు తెలుస్తున్నది.
– లింగన్న, పెద్ద ధన్వాడ, జోగుళాంబ గద్వాల జిల్లా
బోనఫైడ్ కోసం వెళ్తుంటే లాక్కొచ్చారు..
మా బిడ్డలకు సంబంధించి కల్యాణలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేయడానికి బోనఫైడ్ కోసం రాజోళికి వెళ్తుంటే మోటర్‌సైకిల్ నిలిపి లాక్కొచ్చి పోలీసులు కొట్టారు. నేనేమి తప్పు చేశానని పోలీలను ప్రశ్నిస్తే తీసుకెళ్లి డీసీఎంలో వేశారు. అక్కడ నుంచి మానవపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని విడిపించకపోతే పోలీసులు తమపై మరోసారి లాఠీతో కొట్టేవారేమో. కంపెనీపై పోలీసులకు ఎందుకంత ప్రేమ. పోలీసులు వేల మంది గురించి ఆలోచించకుండా ఒకరి కోసం 12 గ్రామాల ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదు.
– లక్ష్మన్న, పెద్దధన్వాడ, జోగుళాంబ గద్వాల జిల్లా
కంపెనీ వద్దు
కంపెనీ వద్దని ఇంతకు ముందే ధర్నాలు, దీక్షలు చేశాం. ప్రజలకు హానీ చేసే కంపెనీలు కట్టనీయమని సారోళ్లు మాట ఇచ్చారు. కంపెనోళ్లు పనులు మొదలు పెట్టనీకె రాత్రికి రాత్రే సామన్లు దింపారు. కట్టమని చెప్పి మళ్లీ పనులు మొదలు పెట్టనందుకే ఊరంతా పోయి పనులు అడుకున్నాం. పనులు అడ్డుకున్నందుకు మా ఇంట్లో ఇద్దరిని అరెస్టు చేసి తీసుకుపో యారు. పెద్ద సారోళ్లు మాకు అన్యాయం చేయాలి. మా వాళ్లను విడిపించాలి.
– నాగేంద్రప్ప, పెద్ద ధన్వాడ, రాజోళి మండలం
నమ్మించి మోసం చేశారు..
కంపెనీ వద్దని 12 ఊర్ల మంది పోరాటం చేస్తుంటే సారోళ్లు ఎందుకు అక్కడే కంపెనీ కట్టాలనుకుంటున్నారు. మీకు ఏమీ కాదని చెప్పి నమ్మించి మోసం చేశారు. కంపెనీ కట్టం అని చెప్పి రాత్రికి రాత్రే లేబరు, సా మానులు తెచ్చి పనులు మొదలు పెట్టారు. అందుకే మేం అడిగి నీకె పోయాం. వాళ్లు కొట్టనీకె వస్తే మేం అన్ని దొబ్బి పాడు చేసి వచ్చాం. మా ఊర్లు పాడైపోతే మేమ ఎక్కడి పోవాలి. నా కొడుకు నర్సింహులు, నా మొగుడిని పోలీసులు పట్టుకుపోయారు. పెద్ద సారోళ్లు మరో ఆ సారి ఆలోచించాలి. మేం కంపెనీ కట్టనీయమంటే కట్టనీయం. నూనె చెట్లు సాగు చేస్తామంటే మా వాళ్లు పొలాలు అమ్మినారు.. కంపెనీ కడతామంటే ఎకరం కూడా అమ్మెటోళ్లం కాదు.