Telangana | కొల్లాపూర్ రూరల్, ఫిబ్రవరి 28: ఆ ఊరు పేరు బొల్లారం ( Bollaram ).. అటవీప్రాంతంలో ఎర్రగట్టు వద్ద తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకోవడంతో శాశ్వతంగా ఎర్రగట్టు బొల్లారం ( Yerragattu Thanda )గా పిలుస్తున్నారు. బొల్లారం గ్రామం మొదట్లో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలం జలాశయం నిర్మాణం చేపట్టేందుకు అప్పటి సర్కార్ వారిని అక్కడి నుంచి తరలించి నదికి పడమటి వైపున ఎగువ భాగంలోని అటవీ ప్రాంతంలోని ఎర్రగట్టు వద్ద నివాసం ఏర్పర్చుకునేందుకు 108కుటుంబాలకు పట్టాలిచ్చి చేతులు దులుపుకొన్నది. అప్పటినుంచి నేటికీ అక్కడ శాశ్వతనివాసాలు లేవు. నిత్యం అటవీశాఖ వారికి అడ్డు తగులుతున్నది. అప్పట్లో తాసిల్దార్ కార్యాలయం నుంచి పట్టాలు ఇచ్చారు. కానీ, అటవీశాఖ అధికారులు అడ్డుతగలడంతో నేటికీ గుడిసెల్లోనే, తాత్కాలిక రేకుల షెడ్లలో నివాసముంటున్నారు. 38ఏండ్లు కావస్తున్నా అధికారుల్లో చలనం లేదు. నేటికీ పక్కా ఇండ్ల నిర్మాణం వారికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
కొల్లాపూర్ మండలకేంద్రానికి సమీపంలో కృష్ణానది ఒడ్డున ఒకప్పుడు బొల్లారం గ్రామం పచ్చటి పొలాలతో కళకళలాడేది.. సారవంతమైన భుములుండేవి.. ఏడాదిలో మూ డు పంటలు పండించేవారు. బతుకుబండి హాయిగా సాగుతున్న తరుణంలో శ్రీశైలం జలాశయం నిర్మాణం వారి బతుకులను ఛిద్రం చేసింది. ముంపు గ్రామాల్లో బొల్లారం కూడా ఒకటి కావడంతో అధికారులు అక్కడినుంచి గ్రామస్తులను 1981లో తరలించారు. ఇండ్లకు బదులు ఇండ్లు, భూములకు బదులు భూములు ఇస్తామని అధికారులు నచ్చజెప్పడంతో గ్రామస్తులు వారి మాటలు నమ్మి అక్కడినుంచి తరలొచ్చారు. దీంతో రెవెన్యూ అధికారులు మొలచింతలపల్లి అటవీప్రాంతం సమీపంలోని ఎర్రగట్టు బొల్లారం వద్ద అప్పట్లో 135ఎకరాల విస్తీర్ణంలో భూములను సాగు చేసుకోవడానికి పట్టాలు ఇచ్చారు. సాగుభూములకు దగ్గరగా ఎర్రగట్టు వద్ద 202కుటుంబాలకు ఇండ్ల స్థలాలను కేటాయించి పట్టాలు కూడా ఇచ్చారు. కానీ, ఊరు తరలించే కంటే ముందే కొందరు భూమిలేని పేదలు పోడు వ్యవసాయం చేస్తుండేవారు. దీంతో అధికారులు వారికి సాగుభూములు ఇవ్వకుండా మొండిచేయి చూపారు. అయితే అప్పట్లో లబ్ధిపొందిన వారిలో 60శాతం ఎస్సీలు, 20శాతం బీసీలు, 20శాతం ఎస్టీలు ఉన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 1981, మే 22న ముంపు నిర్వాసితులకు అధికారికంగా స్థలాలను కొలిచి ఇండ్లపట్టాలు ఇచ్చారు. ఇండ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వపరంగా ఆర్థికసాయం అందిస్తామని అప్పట్లో అధికారులు నమ్మబలికారు. తప్పని పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు తాత్కాలికంగా పూరిగుడిసెలు వేసుకొని జీవనం ప్రారంభించారు. అలా దాదాపు నాలుగు దశాబ్దాలు దాటినా శాశ్వత నివాసాలకు ఎదురుచూపులే మిగిలాయి. నేటికీ తమను అన్ని రాజకీయపార్టీలు ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్ప సమస్యను పరిష్కరించే నాథుడే కరువయ్యాడని ఆ గ్రామస్తులు వాపోతున్నారు.
అటవీశాఖ నుంచి అనుమతి లేకుండా పట్టాలు ఇచ్చారని, అవి చెల్లవని అక్కడి గ్రామస్తులకు శాశ్వత నిర్మాణాలకు తావివ్వకుండా అటవీశాఖ ఆంక్షలు విధించింది. నిర్వాసితులుగా అక్కడికి వచ్చి తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకున్న 108 కుటుంబాల్లో ఇప్పటికే ఉపాధిని వెతుక్కుంటూ చాలా కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాయి. ప్రస్తుతం ఆ గ్రామంలో 30గుడిసెల్లో జనాలు కాపురముంటున్నారు. అందులో కొంతమంది ఉమ్మడి కుటుంబాల నుంచి వేరు పడి రేకుల ఇండ్లు నిర్మించుకున్నారు. ఉపాధి అవకాశాలకు తావులేకుండా నట్టడవిలో సాగు భూములకు దూరంగా ఇండ్ల స్థలాలు చూపడంతో బొల్లారం గ్రామస్తులు ఉపాధి అవకాశాలు లేక తల్లడిల్లి పోతున్నారు. కానీ, అటవీశాఖ మాత్రం తాము పెట్టిన ఆంక్షలను సడలించడం లేదు. అధికారులను ఎంత ఒప్పించినా చట్టప్రకారం శాశ్వత నిర్మాణాలు చేపట్టేందుకు వీలులేదని పట్టుపట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వపరంగా ఆ గ్రామానికి ఏకోపాధ్యాయ పాఠశాల మంజూరైంది. పాఠశాల భవనానికి కూడా అప్పట్లో నిధులు మంజూరయ్యాయి. కానీ, అటవీశాఖ ఆంక్షల కారణంగా వచ్చిన నిధులు తిరిగివెళ్లాయి. కొన్నేండ్లపాటు పూరి గుడిసెలోనే అక్కడి విద్యార్థులకు బోధన జరిగింది. కాలక్రమేణా ప్రభుత్వం అక్కడున్న పాఠశాలను కూడా ఎత్తివేసింది. ప్రస్తుతం గ్రామంలో మిషన్‌భగీరథ నీటి ట్యాంకులు మాత్రం శాశ్వత నిర్మాణానికి నోచుకున్నాయి.
మా తాత ముత్తాతలు ఉండే బొల్లారం ముంపునకు గురైనప్పుడు అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులు వచ్చి మీకు భూములు ఇస్తాం, నష్టపరిహారం ఇస్తాం, ఉచితంగా స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తామన్నారు. అప్పట్లో నష్టపరిహారం మాత్రం ఇచ్చారు. కానీ, ఇండ్లు కోల్పోయిన వారికి అడవిలో స్థలాల పట్టాలిచ్చి చేతులు దులుపుకున్నారు. శాశ్వతంగా ఇండ్లు నిర్మించలేదు. మేం సొంతంగా కట్టుకుంటే ఫారెస్టు అధికారులు అడ్డుపడుతున్నారు. ఉపాధికి వెళ్లిన కుటుంబాలు మినహా ప్రస్తుతం 60కుటుంబాలు నివాసముంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలి.
– ఏ వెంకటేశ్వర్లు, కే వెంకటేశ్వర్లు, ఎర్రగట్టు బొల్లారం
నా భర్త ఏండ్లుగా ఇండ్లు వస్తాయి.. భూములిస్తారని ఆశగా ఎదురుచూసిండు. కోరిక తీరకుండానే సచ్చిపోయిండు. అలాగే చాలామంది ఎదురుచూసి సచ్చిపోయిండ్రు. అప్పట్లో ఉన్న చంటి పిల్లలు నేడు పెద్దవారయ్యారు. అందరికీ పెండ్లిళ్లు అయ్యాయి. వారి పిల్లలు కూడా పెద్దవారయ్యారు. ఐదేండ్లకోసారి రాజకీయ నాయకులు ఓట్లకోసం వస్తరు.. ఏదో చెప్పి ఓట్లు వేయించుకుంటరు తప్పా పరిష్కారం చూపే నాథుడే కరువయ్యాడు. గ్రామంలో ఇండ్లు లేవు, సాగు భూములు లేవు. పూరి గుడిసెల్లోనే ఉంటున్నం. మా పిల్లలు ఊర్లపోంటి, దేశాలకు వెళ్లి కూలీ చేసుకొని బతుకుతున్నరు. సీఎం కేసీఆర్ సారైనా.. న్యాయం చేస్తాడని ఆశపడుతున్నాం.
– పోషమ్మ, ఎర్రగట్టు బొల్లారం