మిడ్జిల్, ఫిబ్రవరి 20 : కోళ్ల ఫారాల్లో అపరిశుభ్రత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్యాధికారి శివరాజ్ అన్నారు. గురువారం మిడ్జిల్ మండలం వేముల గ్రామంలోని వెంకో రీసెర్చ్ అండ్ బ్రీడర్ ఫారంలో బర్డ్ ఫ్లూపై తనిఖీలు నిర్వహించారు. ఇటీవల పౌల్డ్రీ ఫామ్‌ల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకుతున్న నేపథ్యంలో ఆయన ఆయా కోళ్ల ఫారాల్లో పని చేస్తున్న సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
ప్రతిరోజు బయో సెక్యూరిటీ నిబంధనలకు అనుగుణంగా పౌల్ట్రీ ఫారం నిర్వహణపై పశువైద్యాధికారి శివరాజ్ అవగాహన కల్పించారు. కోళ్ల ఫారాల్లో చనిపోయిన కోళ్లను లోతైన గుంతలు తవ్వి సున్నం వేసి, మట్టితో పూడ్చివేయాలని చెప్పారు. ఎక్కువగా కోళ్లు మరణిస్తే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ తనిఖీలో సిబ్బంది సాగర్, వెంకో మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.