పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటితో వందేండ్ల గోస తీరనున్నదని, సాగునీటి రంగంలో ఇది చారిత్రాత్మక విజయమని, నాడు దగాపడిన జిల్లా నేడు సాగునీటికి కేరాఫ్‌గా మారిందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం కొల్లాపూర్ సమీపంలో సీఎం కేసీఆర్ పర్యటన, బహిరంగ సభా స్థలాన్ని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఐజీ షానవాజ్ ఖాసీం, కలెక్టర్ ఉదయ్‌కుమార్‌తో కలిసి మంత్రులు పరిశీలించారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ నార్లాపూర్ లిఫ్ట్‌లో మొదటి పంప్‌ను సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయనుండడంతో ప్రపంచం నివ్వెరపోయే విధంగా సుజల దృశ్యాన్ని చూడబోతున్నామని చెప్పారు. ఇక పాలమూరు పొలాల్లో కృష్ణమ్మ జలతాండవం చేయనున్నదని చెప్పారు.
– కొల్లాపూర్, సెప్టెంబర్ 11
వనపర్తి టౌన్, సెప్టెంబర్ 11: అన్నివర్గాలు బాగుండాలని కోరుకునే నాయకుడే సీఎం కేసీఆర్ అని, సనాతన ధర్మానికి పునాది శాస్త్రీయత అని, సరైన ఆలోచనా విధానం, మార్గం శాస్త్రీయత అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ పరిషత్ సమావేశ మందిరంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా పూర్ణకుంభంతో మంత్రికి బ్రాహ్మణులు స్వాగతం పలికారు. అనంతరం పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. వనపర్తి బ్రాహ్మణ సమావేశ మందిరాన్ని నిర్మించిన ధాత రామకృష్ణ శర్మను మంత్రి అభినందించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బ్రాహ్మణ సంఘం నేతలు మంత్రికి అందజేశారు. వీటిని త్వరగా పరిష్కరమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆత్మీయ సమ్మేళనంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మార్కెట్ చైర్మన్ రమేశ్‌గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్, బ్రాహ్మణ పరిషత్ డైరెక్టర్ శ్రీకాంత్, నిర్వాహకులు సాయికుమార్, శ్రీధర్‌రావు, చంద్రశేఖర్‌రావు, ఆల్ ఇండియా అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు గోపాలకృష్ణశర్మ తదితరులు ఉన్నారు.
పనిచేసే ప్రభుత్వం వెంటే ప్రజలు
వనపర్తి, సెప్టెంబర్11: పనిచేసే ప్రభుత్వం వెంటే ప్రజలంతా ఉంటారని.. అందుకు నిదర్శనమే స్వచ్ఛందంగా ఇతర పార్టీల నుంచి నిత్యం బీఆర్ఎస్లో చేరుతున్న ప్రజలే సాక్ష్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సూర్యవంశం గిరి ఆధ్వర్యంలో నర్సింగాయపల్లికి చెందిన 30మంది కాంగ్రెస్ నాయకులు అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ముందుగా వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా అధికార ప్రతినిధి వాకిటిశ్రీధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌గౌడ్, వనపర్తి రీజనల్ ట్రాన్స్‌కో అథారిటీ సభ్యుడు రమేశ్, పార్టీలో చేరినవారు మణ్యం, శేఖర్‌రెడ్డి, బాలస్వామి, బాలరాజు, మహేశ్, మాసన్న, సైదులు పాల్గొన్నారు.
ప్రజలకు పాలన మరింత చేరువలో..
వనపర్తి అర్బన్, సెప్టంబర్ 11: సీఎం కేసీఆర్ ముందుచూపు ఆలోచనతో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ పాలన మరింత చేరువయ్యేందుకు జిల్లాల ఏర్పాటుతోపాటు ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో పీఆర్ ఎస్ఈ, విజిలేన్స్,క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలను కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్, అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంతో కలిసి మంత్రి రిబ్బన్ కట్టు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంతకుముందు కార్యాలయ ప్రారంభోత్సవ అనంతరం ఎస్ఈ శివకుమార్, క్వాలిటీ కంట్రోలర్ కిషన్ సింగ్‌ను వారి సీట్లలో కూర్చోబెట్టి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, వైస్‌చైర్మన్ శ్రీధర్, పీఆర్ ఈఈ మల్లయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.