వనపర్తి, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : వనపర్తి మున్సిపల్ పరిధిలోని చెరువుల్లో చేపట్టిన నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. ఇటీవలే రాష్ట్రంలోని పలుచోట్ల చెరువుల్లోని నిర్మాణాలను కూల్చివేస్తున్న క్రమంలో ఆ సెగ వనపర్తికి పాకినైట్లెంది. ఈ మేరకు గురువారం సాయంత్రం పట్టణ పరిధిలోని నల్లచెరువులో నీళ్లు రాకుండా కట్టిన ఓ గోడను అధికారులు జేసీబీతో తొలగించారు.
అయితే వనపర్తి పట్టణాన్ని అనుసరించి నల్లచెరువు, తాళ్ల చెరువు, అమ్మ చెరువు, మర్రికుంటలు ఉండగా ప్రస్తుతం నల్ల చెరువు పరిధిలో 9 మందికి, తాళ్ల చెరువు పరిధిలో ఆరుగురికి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే, మున్సిపల్ అనుమతులతోనే వీరంతా నిర్మాణాలు చేసుకున్నామని చెబుతుండగా, ఆ నోటీసుల జారీ వివాదాస్పదమవుతున్నది. పూర్తిస్థాయి సర్వే జరిగి ఎఫ్టీఎల్ను గుర్తించడం ద్వారానే అసలు విషయం బయట పడనుంది.
ఇదిలా ఉంటే.. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలు వివాదాస్పదంగా మారుతున్నాయి. పారదర్శకత లేకుండా హైడ్రా కొనసాగుతుందని, నిరుపేదల ఇండ్లన్నీ నేలమట్టం చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతూనే ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్‌ను వివరణ కోరగా.. వనపర్తి పట్టణంలోని నాలుగు చెరువులకు సంబంధించి సర్వే చేస్తున్నామని, వీటిలో కొన్నింటిని గుర్తించి నిర్మాణాలు చేసుకున్న 15మందికి నోటీసులిచ్చామన్నారు. నల్ల చెరువు పరిధిలో ఉన్న చిన్న గోడను మాత్రమే తొలగించామని, ఇండ్ల వరకు వెళ్లలేదన్నారు. పూర్తి స్థాయి సర్వే నిర్వహించి ఆక్రమణలో ఉన్న వారందరికీ నోటీసులిస్తామన్నారు.