వనపర్తి, జూలై 9 (నమస్తే తెలంగాణ) : విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ వ్యవస్థ అధికారుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. శాఖ పరంగా చేపట్టే పనులకు టెండర్లు లేకుండా డ బ్బులకు ఆశపడి ఎడాపెడా పనులను అప్పగించడం వివాదం గా మారుతున్నది. దీంతో ఎప్పుడో చేయాల్సిన పనులు రెండేండ్లుగా పెండింగ్‌లోనే పడుతున్నాయి. దీన్ని బట్టి అధికారుల ప ని తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ శాఖలో పనిచేస్తున్న ముగ్గురు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడడం తో రైతుల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల పనులన్నీ అటకెక్కాయి.
విద్యుత్ శాఖలో చేపట్టే పనులకు టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తున్నారు. రూ.50 వేలకు మించితే టెం డర్లు కచ్చితంగా ఉండాలి. అయితే, చిన్న, పెద్ద పనులంటూ తేడా లేకుండా అన్నింటినీ నచ్చిన వారికే ముట్టజెబుతున్నారు. అందినకాడికి దండుకొని రాత్రికి రాత్రే ఆర్డర్లు జారీ చేస్తూ మమ అనిపిస్తున్నారు. రూ.కోట్ల పనులను సైతం విభజించి త మకు అనుకూలంగా ఉన్న వారికి కట్టబెడుతున్నారు. వనపర్తి జిల్లావ్యాప్తంగా ఇలా పనులను అప్పజెప్పడం వల్లే సమస్య ముదిరింది. గతంలో ఏ పనులకైనా టెండర్లు నిర్వహించే పరిస్థితి ఉండేది. కాగా, రెండు, మూడేండ్ల నుంచి టెండర్ వ్యవస్థ కు పూర్తిగా బ్రేకులు పడ్డాయి. పెద్ద పనులను సైతం మూడో కంటికి తెలియకుండా.. టెండర్లు లేకుండానే ఇష్టానుసారంగా అప్పజెబుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వ్యవసాయ విద్యుత్ పనులే కాకుండా కమర్షియల్ పనులను సైతం లోలోపల ఒప్పందాలు చేసుకొని నామినేషన్ పద్ధతిలో మమ అనిపిస్తున్నారు. జిల్లాలో పలుచోట్ల చేపట్టిన ఇండియన్ గ్యాస్ గోదాంల విద్యుత్ పనుల్లో కూడా పెద్ద ఎత్తున గో ల్మాల్ జరిగినట్లుగా ఆరోపణలున్నాయి.
విద్యుత్ పనుల కేటాయింపుల్లో వివాదం ముదిరింది. గ తంలో పనిచేసిన ఓ అధికారి తనకు నచ్చిన వారితో ఒప్పందం చేసుకొని కొన్ని పనులను అప్పగించారు. దీంతో మిగతా కాం ట్రాక్టర్లు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ క్రమంలో ఆ ప నులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. నచ్చిన వారికి ఇచ్చి తమకు మొండి చేయి చూపిస్తే.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు మిగిలిన కాంట్రాక్టర్లు సిద్ధం కావడంతో సమస్య మరింత జఠిలమైంది. ఇదిలా ఉంటే, బదిలీల ప్రక్రియను ముందే ఊహించిన అధికారులు.. ఇక తాము కూడా వెళ్లిపోతామనే లక్ష్యంతో అందినకాడికి దండుకొని కొందరికి పనులను అప్పగించడం మరింత వివాదానికి దారితీసింది. ప్రస్తుతం ఆ అధికారులు ఏసీబీ ట్రాక్‌లో పడడంతో పరిస్థితి ఉల్టా పల్టా అయిం ది. ఇప్పటికైనా మార్గదర్శకాలను పాటిస్తూ పనులను పారదర్శకంగా నిర్వహించకుంటే మరిన్ని వివాదాలకు దారులు తెరిచినట్లవుతుంది.
వనపర్తి జిల్లా విద్యుత్ శాఖలోని వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బంధువులు కాంట్రాక్టర్ల అవతారమెత్తారు. 20 ఏండ్ల కిందటి వరకు విద్యు త్ శాఖలో పనులు చేసే కాంట్రాక్టర్లు కేవలం 30 మంది మాత్రమే ఉండేవారు. కానీ, కేవలం మూడేండ్లలోనే దాదాపు 30 మంది కాంట్రాక్టర్లు కొత్తగా పుట్టుకొచ్చారంటే అధికారుల తీరు ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కింది నుంచి పై వరకు పనిచేసే ఉద్యోగుల కుటుంబసభ్యులు, బంధువులు కాంట్రాక్టర్లుగా పనిచేస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులే సహకరిస్తుండడంతో వీరికి ఎదురులేకుండా పోయింది. ఎక్కువ డబ్బులకు ఆశపడి పనులను సైతం వీరికే కట్టబెడుతుండడంతో పాత, కొత్త కాంట్రాక్టర్ల మధ్య అగ్గి రాజుకున్నది. కొత్తగా వచ్చిన వారికి పనులను అప్పగించిన సందర్భంలోనే ఏసీబీ అధికారుల దాడులు జరిగినట్లు చర్చ కొనసాగుతున్నది.