మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 1 : పాలమూరులో సినీనటి ఊర్వశి రౌతేలా సందడి చేసింది. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 39వ సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ ప్రారంభోత్సశానికి హాజరయ్యారు. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్, స్థానికులు ఎగబడడంతో పట్టణం జనసందోహమైంది. మున్సిపల్ కార్యాలయం నుంచి క్లాక్‌టవర్ వరకు ట్రాఫిక్ స్తంభించింది. అభిమానులు, యువకులను కంట్రోల్ చేయడానికి ప్రైవేట్ బౌన్సర్లు, పోలీసులు నానా తంటాలు పడ్డారు. షాపింగ్‌మాల్ ఓపెనింగ్ అనంతరం అభిమానులను ఎలా ఉన్నారు.. అంటూ ఉర్రూతలూగించారు.
డాకు మహారాజ్ పాటకు స్టేజ్‌పై స్టెప్పులేశారు. యువత ఈలలు వేస్తూ కేరింతలు కొట్టారు. సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌లో సౌత్ ఇండియా షాపింగ్‌మాల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నాణ్యమైన వస్ర్తాలు ఇక్కడ లభిస్తాయని.. ప్రజలు కొనుగోలు చేయాలని సూచించారు. అంతకుముందు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం షాపింగ్‌మాల్‌లో బంగారు ఆభరణాలు, లేడీస్, జెంట్స్, కిడ్స్వేర్లో కలయతిరిగారు. అనంతరం సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ డైరెక్టర్లు మాట్లాడుతూ మా దగ్గర నాణ్యగల అన్ని రకాల బంగారు ఆభరణాలు, వస్ర్తాలు లభిస్తాయన్నారు. శుభకార్యాలకు పెట్టింది పేరు సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ అన్నారు. కాస్ట్ టు కాస్ట్ వస్ర్తాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ రాంలక్ష్మణ్ పాల్గొన్నారు.