మరికల్, సెప్టెంబర్ 4 : కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం.
నిత్యం తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్ద బారులుతీరుతున్నారు. తిండితిప్పలు మానుకొని పొద్దస్తమానం క్యూలైన్లో ఉన్నా బస్తాలు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరులో యూరియా అందించడం లేదని రైతులు నిరసనకు దిగారు.
పీఏసీసీఎస్కు 900 బస్తాల యూరియా రాగా దాదాపు వెయ్యి మంది రైతుల కేంద్రం వద్దకు తరలివచ్చారు. కొందరికే యూరియా అందగా.. మిగితా వారు నిరసనకు దిగారు. లాల్కోట చౌరస్తా వద్ద అంతరాష్ట్ర రహదారిపై చేరుకొని బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. రైతులందరికీ యూరియా అం దించాలని డిమాండ్ చేశారు.
దీంతో రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు ఎక్కడికక్కడే నిలి చిపోయాయి. మరికల్ సీఐ రాజేందర్‌రెడ్డి, ఏఎ స్సై రాము, వ్యవసాయ శాఖాధికారి రహమాన్ వెళ్లి రైతులకు సర్దిచెప్పినా వారు వినలేదు. దీంతో కొద్దిసేపు పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నది. టోకెన్లు జారీ చేస్తామని.. యూరియా వచ్చిన వెంటనే పంపిణీ చేస్తామని సర్దిచెప్పడంతో రైతులు రాస్తారోకో విరమించారు.
చైన్ స్నాచింగ్
జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 4 : రోడ్డుపై ఒంటరిగా వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడును గుర్తు తెలియని ఇద్దరు దుండగులు లాక్కెళ్లిన ఘటన జడ్చర్లలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. మున్సిపాలిటీలోని కావేరమ్మపేట పరిధిలో ఉన్న ఫ్రీజన్కాలనీకి చెందిన జీ.నాగలక్ష్మి గురువారం ఉదయం 11 గంటల సమయంలో రేషన్ దుకాణంలో బియ్యం తీసుకొని తిరిగి ఇంటికి బయలుదేరింది.
అదే సమయంలో ఇద్దరు గుర్తు తెలియని యువకులు బైక్‌పై వచ్చి ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. బాధితురాలు తేరుకొని కేకలు వేసేలోగా దుండగులు బైక్‌పై పారిపోయారు. తర్వాత జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
నిరీక్షించి.. నీరసించి..
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు. గురువారం తెల్లవారు జాము నుంచే విక్రయ కేంద్రాల వద్దకు భారీగా తరలివచ్చి గుమిగూడారు. గంటల తరబడి పెద్ద ఎత్తున బారులు తీరారు. నిలబడే ఓపిక లేకపోవడంతో వారి చెప్పులు, రాళ్లను, ఆధార్, పట్టాపాస్ పుస్తకాలను వరుసలో ఉంచారు. కొందరికి మాత్రమే టోకెన్లు ఇవ్వగా.. మిగితా వారికి ఇవ్వకపోడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా సెలవులు ఉన్నాయి.. యూరియా ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అంటూ సిబ్బంది చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ నిరాశతో వెనుదిరిగారు.
ఎలక్షన్ల కోసం కాదు..
సంఘం వద్ద గురువారం మహిళలు, పురుషులు వేర్వేరుగా పెద్దమొత్తంలో క్యూలైన్లు కట్టారు. అయితే రైతులు టోకెన్ల కోసం మళ్లామళ్లా వస్తున్నారని పోలీసులు మార్కర్‌తో రైతుల చేతివేలిపై గుర్తు పెట్టి టోకెన్లు పంపిణీ చేశారు. ఈ దృశ్యాలను చూసిన ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే రాలేదు కదా..? ఇదేంది అని చర్చించుకోవడం కనిపించింది. ఇవి ఎలక్షన్ల కోసం కాదు.. యూరియా కోసం అంటూ పలువురు రైతుల పడుతున్న బాధలను తెలుసుకొని మద్దతు తెలిపారు.
సొమ్మసిల్లి పడిపోయిన మహిళ
నారాయణపేట జిల్లా తీలేరు పీఏసీసీఎస్ వద్దకు రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఉదయం నుంచే బారులుతీరారు. యూరియా కోసం మహిళా రైతు మణెమ్మ గురువారం తెల్లవారు జామున 5 గంటలకు వచ్చి క్యూలో నిలబడింది. అయితే సిబ్బంది పంపిణీ చేస్తుండగా.. 11 గంటల సమయంలో ఒక్కసారిగా మణెమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. తోటి రైతులు వెంటనే 108కు అంబులెన్స్‌కు సమాచారం అందించగా.. ఆమెను చికిత్స నిమిత్తం మరికల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రాస్తారోకో చేస్తున్న రైతులు అంబులెన్స్‌కు దారిచ్చి మానవత్వం చాటుకున్నారు.