గట్టు, ఆగస్టు 19 : వారం రోజుల తర్వాత యూరియాను మంగళవారం పంపిణీ చేస్తారని తెలియడంతో తెల్లవారుజాము నుంచే రైతులు పీఏసీసీఎస్ కార్యాలయానికి పరుగులు పెట్టారు. ముసురు వర్షంలోనూ రైతులు టవాళ్లు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డుల జిరాక్స్ ప్రతులు సైతం వర్షానికి తడవకుండా కవర్లలో ఉంచి క్యూలైన్లో పెట్టారు.
నగదును సైతం కవర్లలో పెట్టడానికి ప్రయత్నించగా, కొందరు వారించారు. మహిళా రైతులతోపాటు దివ్యాంగ రైతులు సైతం యూరియా కోసం తరలివచ్చారు. పీఏసీసీఎస్ అధికారులు 10గంటలకు కార్యాలయానికి చేరుకోగా రైతులు ఒక్కసారిగా గుమిగూడారు. దీంతో అధికారులు పోలీసుల పహారాతో ఒక్కో రైతుకు రెండు బస్తాల యూరియాను మాత్రమే పంపిణీ చేశారు.
తాజాగా మరో 300 బస్తాల యూరియా పీఏసీసీఎస్కు వచ్చింది. ఇదిలా ఉండగా, తాము ఇదివరకే పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ జిరాక్స్ ప్రతులు అధికారులకు ఇవ్వగా తాజాగా వచ్చిన వారికి ఎలా పంపిణీ చేస్తారని అధికారులను రైతులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ హ యాంలో పదేండ్లలో ఎరువులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని, మార్పు అంటూ వచ్చిన కాంగ్రెస్ అష్టకష్టాలు పెడుతున్నదని మండిపడ్డారు.