అలంపూర్, ఏప్రిల్ 3 : గ్యాస్ కొరత లేదు.. మీ ఇండ్ల వద్దకే గ్యాస్ సిలిండర్లు చేరుస్తామని ఓ వైపు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఏ మార్పు కనబడటం లేదు. గ్యాస్ సిలిండర్లు గ్రామాలకు రాకపోవడంతో ఖాళీ గ్యాస్ బండను భుజాన వేసుకొని ఏజెన్సీల వద్దకు చేరుకోక తప్పడం లేదు. అయినా తిప్పలు తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. శుక్రవారం మానవపాడు మండలంకేంద్రంలో గ్యాస్ కోసం బారులుదీరారు.
గంటల తరబడి గ్యాస్ కోసం ఎండలో పడిగాపులు కాయావల్సి వస్తుందని వాపోయారు. ఏజెన్సీ వారు వినియోగదారులకు కనీస సౌకర్యాలు నీడ, తాగునీరు కూడా కల్పించలేదని పిల్లాపాపలతో వచ్చిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మం దికి మొబైల్ ఫోన్లకు ఓటీపీలు రాక బుకింగ్ కావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులకు సిలిండర్లు ఇవ్వకుండా బ్లాక్‌మార్కెట్ కు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు చొరవ చూపి తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.