అలంపూర్ చౌరస్తా, ఏప్రిల్ 15 : వ్యయప్రయాసాలకోర్చి సా గు చేసిన మొక్కజొన్న పంటను కోసి కుప్పగా పోయగా, గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో 40 క్వింటాళ్లు పంట నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ఉండవల్లి మండలం కంచుపాడుకు చెందిన అచ్చెన్న అదే గ్రామంలో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగుచేశాడు.
ఇందుకు రూ.2లక్షలు ఖర్చయ్యింది. సోమవారం కూలీలతో కలిసి 4ఎకరాల్లో మొక్కజొన్న కంకులను తెంపి పొలంలోనే మిషన్‌కు వేసేందుకు కుప్పగా పోశారు. మంగళవారం తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు మొక్కజొన్న కంకులను నిప్పుపెట్టడంతో 40క్వింటాళ్లు కాలిబూడిదైంది.
విషయం తెలుసుకున్న అచ్చెన్న కు టుంబ సభ్యులు, గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. కౌలుకు తీసుకొని అప్పులు చేసి పంట పండిస్తే బూడిదపాలైదంటూ కన్నీరు పెట్టుకున్నారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు మొక్కజొన్నకు పెట్టిన నిప్పు కారణంగా పొలం పరిధిలోని 100 ఎకరాల్లో ఇతర పొలాల గెట్లకు నిప్పంటుకున్నది.