కొల్లాపూర్, మే 16 : కొల్లాపూర్ పట్టణంలో అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ వేధింపులు భరించలేక ఓ బాధిత కుటుంబం చంటి పిల్లలతో కలిసి శనివారం అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. బాధిత కుటుంబం ధర్నా చేస్తున్న క్రమంలోనే మంత్రి జూపల్లి కృష్ణారావు ఏరియా ప్రభుత్వ దవాఖానకు రావడం అక్కడే బాధిత కుటుంబం ధర్నా చేస్తుండడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. మంత్రిని కలిసి సమస్యను వివరించేందుకు వెళ్లిన బాధిత కుటుంబానికి చుక్కెదురైంది. దీంతో బాధిత కు టుంబం అంబేద్కర్ విగ్రహం ఎదుట శాంతియుతంగా నిరసన కార్యక్రమానికి పూనుకొన్నది.
ఈ సందర్భంగా బాధితులు రామకృష్ణ, వెంకటేశ్‌లు తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ మార్కెట్ యార్డు వెనుక భాగంలోని సర్వే నెంబరు 104లో దాదాపు 20 మంది నిరుపేద కుటుంబాలు ప్లాట్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ తన అధికార బలంతో తమ విలువైన ప్లాట్లను అక్రమంగా కబ్జా చేశారన్నారు. తమ ప్లాట్లు తమకు కావాలని అడిగినందుకు అక్రమ కేసులు పెట్టి పోలీసు స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతూ గత ఐదేండ్లుగా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూలీ పని చేసుకునే తమపై కేసులు ఉండడంతో పని కూడా దొరకడం లేదన్నారు. హైదరాబాద్ లాంటి చోట్ల వాచ్మెన్ పని చేసుకునే వాళ్లమని కోర్టుల చుట్టూ తిరుగుతుండడంతో ఇప్పుడు ఎవరూ పనిలో పెట్టుకోవ డం లేదన్నారు. కూలి చేస్తేనే తమకు పూట గడుస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసులను వాపస్ తీసుకుంటామని నమ్మించి మా ప్లాట్ల ను బలవంతంగా లాక్కొని వాటి స్థానంలో ఎందుకు పనికి రాని ప్లాట్లను ముట్టజెప్పే ప్రయత్నం చేసినట్లు వాపోయారు. మూడో వ్యక్తికి తెలియకుండా రిజిస్ర్టేషన్ సవరణ చేసుకోవాలని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరగలేక నరకయాతన అనుభవిస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం కేసులను వాపస్ తీసుకోవాలి అంటే కేసులు నడుస్తూనే ఉంటాయని తమను తీవ్రంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడని బాధితులు పేర్కొన్నారు.
పిల్లలను అదుపులోకి తీసుకునే యత్నం..
అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ బారి నుంచి రక్షించాలని, తమకు న్యాయం చేయాలని శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన బాధిత కుటుంబానికి పోలీసుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. విధిలేని స్థితిలో పిల్లలతో ఎవరికీ ఆటంకం లేకుండా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బాధితులను పోలీసు స్టేషన్‌కు తరలించే క్రమంలో హైడ్రామా నెలకొన్నది. చంటి పిల్లలతో నిరసన కార్యక్రమంలో కూర్చున్న బాధిత మహిళ తన పిల్లలకు అక్కడే పాలు ఇవ్వడంతోపాటు టిఫిన్ పెడుతూ న్యాయం కోసం అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆరాటపడుతున్న వారిని చూసి పట్టణ ప్రజలు సానుభూతి వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు బాధిత కుటుంబానికి పెరుగుతోండటంతో పోలీసులు బాధితులను పోలీసు స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసు కారులో బాధిత మహిళతోపాటు చిన్నపిల్లలను ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. ఈ ఘటనను మీడియా చిత్రీకరిస్తుండడాన్ని గమనించిన పోలీసులు కారులోకి ఎక్కిన చంటి పిల్లలను వదిలివేసి బాధితులలో ఒకరైన రామకృష్ణను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.