Ugadi Celebrations | మహబూబ్ నగర్ కలెక్టరేట్ : మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని జయప్రకాశ్ నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం సాయంత్రం విశ్వావసు నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కేఎస్ రవికుమార్ ఆధ్వర్యంలో గణనాథుడికి, చదువుల తల్లి సరస్వతి దేవికి విద్యార్థులు, అధ్యాపకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గొండాల్య రాఘవేంద్రశర్మచే పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన కవి పండితుడు పల్లెర్ల రామ్మోహన్రావు హాజరై ఉగాది పండుగ విశిష్టత వివరించారు. మన దేశ సంస్కృతి చాలా గొప్పదని, మన సంప్రదాయాల వెనుక ధర్మం, మర్మం కలిగి ఉన్నాయన్నారు. ఉగాది పచ్చడిలో తీపి, పులుపు, కారం, చేదు, వగరు, ఉప్పు షడ్రుచులు కలిగి ఉంటాయని పచ్చడి తాగడం వల్ల ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఈ ఏడాది ఉగాది ఆదివారం వచ్చిందని.. సూర్య భగవానుడే రాజు అని గొండ్యాల రాఘవేంద్రశర్మ తన పంచాగంలో తెలిపారు. అన్ని శుభఫలితాలే కలుగుతాయని అన్నారు. విశ్వావసు నామ సంవత్సరంలో 12 రాశుల వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, ఆరోగ్యం ఎలా ఉంటాయనే విషయాలు వివరించారు.
జేపీఎన్సీఈ చైర్మన్ కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ యువత దేశానికి వెన్నుముక, వారే దేశ భవిష్యత్తు అని ప్రపంచంలోని ఏ దేశమైనా యువత ద్వారా అభివృద్ధి, పురోగతి సాధిస్తుందన్నారు. మనలో పట్టుదల, జిజ్ఞాస, సాధన ఉంటే ప్రపంచాన్ని మనవైపు తిప్పుకోవచ్చని యువతకు సూచించారు. సునీత విలియమ్స్న ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ తెలుగు నూతన ఉగాది సంవత్సరంలో విద్యార్థులు అన్ని రంగాలలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యా సంవత్సరంలో జేపీఎన్సీఈ విద్యార్థులు 206 మంది ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించారని, కళాశాల విద్యార్థినీలు అమీనాబేగం ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం సాధించిందని, బీ స్వాతి ఎంబీఏలో జేఎన్టీయూ టాపర్గా నిలిచిందన్నారు. రాష్ట్ర సీఎం చేతుల మీదుగా జేపీఎన్సీఈ విద్యార్థినీలు ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలు సాధించిన వారికి ఆఫర్ లెట్లు, ఖేల్ ఉత్సవ్ క్రీడల్లో విజయాలు సాధించిన వారికి పతకాలు అందజేశారు. రంజాన్ సందర్భంగా ముస్లిం విద్యార్థినీ విద్యార్థులకు అధ్యాపకులకు కళాశాలలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. కార్యక్రమాల్లో కళాశాల కార్యదర్శి వెంకటరామరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణమూర్తి, అకాడమిక్ డైరెక్టర్ సుజీవన్ కుమార్, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్, పరీక్షల నిర్వహణ అధికారి కోటాల సందీప్ కుమార్, నగేశ్ తదితరులు పాల్గొన్నారు.