జడ్చర్ల, ఫిబ్రవరి 19 : వారంరోజులుగా పునరావాస ప్యాకేజీ ఇవ్వాలంటూ ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో బుధవారం నిర్వాసితులు భిక్షాటన చేయడానికి రోడ్డెక్కారు. భూ నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయడం లేదంటూ ఐదారు రోజులుగా రిజర్వాయర్ కట్టపై ఉదండాపూర్ గ్రామానికి చెందిన నిర్వాసితులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జడ్చర్ల పట్టణంలో భిక్షాటన చేయాలని బయలుదేరి వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు భిక్షాటనకు పర్మిషన్ లేదంటూ జడ్చర్ల ప్రభుత్వ అతిథిగృహం వద్ద జడ్చర్ల పట్టణ సీఐ కమలాకర్, రూరల్ సీఐ నాగార్జునగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
దీంతో ఉద్రిక్తత నెలకొన్నది. తమకు న్యాయం జరిగే వరకు నిరసన కార్యక్రమాలు చేపడుతామని తమను ఎందుకు అడ్డుకుంటున్నారని నిర్వాసితులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ సమయంలో తమకు న్యాయం జరగడంలేదని, ప్యాకేజీ ఇవ్వడంలేదంటూ మల్లయ్య అనే రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. పోలీసులు నిర్వాసితులను పోలీస్ స్టేషన్ వరకు తరలించి డీఎస్పీ వెంకటేశ్వర్లుతో మాట్లాడించారు. ఆర్డీవో గురువారం రిజర్వాయర్ వద్దకు వస్తారని, పరిహారం విషయంపై ఆయన మాట్లాడుతారని అందుకని భిక్షాటన చేయవద్దని, భిక్షాటన చేస్తే ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుందని వారికి నచ్చజెప్పి పంపించారు.
ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ తమభూములు లాక్కొని తమకు నిల్వనీడలేకుండా చేసి పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం చేస్త్తూ తమ జీవితాలతో ఆటలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాపై కేసులు పెట్టినా సరే తమ దీక్షలను కొనసాగిస్తామని, ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నిర్వాసితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మంత్రులు వచ్చి ఆరు నెలలు దాటిపోయినా నేటి వరకు ప్యాకేజీ డబ్బులు ఇవ్వలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా భూములను తీసుకొని ఇండ్లకు సంబంధించిన సర్వే చేసిన సమయంలో 18ఏండ్లు నిండని వారిని పరిహారం పరిధిలోకి తీసుకోలేదని, ఇప్పుడు 18ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
తమకు న్యాయం జరిగే వరకు ఎవరెన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడేదిలేదని, తాము నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామని హెచ్చరించారు.