జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 14: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని పెంచి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శుక్రవారం మూడో రోజుకు చేరుకున్నది. జడ్చర్ల మండలంలోని ఉదండాపూర్ రిజర్వాయర్ కట్ట వద్ద నిర్వాసితులు టెంట్ వేసుకొని రిలే దీక్షకు పూనుకున్నారు. రిజర్వాయర్ కట్ట వద్ద పనులకు సిద్ధమవుతున్నారన్న విషయాన్ని తెలుసుకున్న నిర్వాసితులు ప్రాజెక్టు కట్ట వద్దకు వెళ్లి పనులు చేయొద్దంటూ జేసీబీలను నిలిపివేసి పనులను అడ్డుకున్నారు.
మాకు న్యాయం జరిగే వరకు పనులు చేయొద్దంటూ హెచ్చరించారు. ఆ తర్వాత నిర్వాసితులు రిలే నిరాహార దీక్షలో బైఠాయించి పునరావాస ప్యాకేజీ ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల ఎస్సై చంద్రమోహన్ పోలీసులతో దీక్షా శిబిరం వద్దకు చేరుకుని నిర్వాసితులతో మాట్లాడారు. అనంతరం అక్కడి పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తక్షణమే రూ.25 లక్షలు ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. రిజర్వాయర్ కోసం మా భూములు, ఇండ్లు కోల్పోయి న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత రేటు ప్రకారం ప్యాకేజీ పరిహారాన్ని నిర్ణయించి డబ్బులు చెల్లించే వరకు ప్రాజెక్టు వద్ద ఎలాంటి పనులు చేపట్టవద్దని కోరారు. నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ పెంచి ఇచ్చేవరకు రిలేనిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. శాంతిపూర్వకంగా చేస్తున్న దీక్షను అడ్డుకునేందుకు ఎవరైనా యత్నిస్తే తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.