జడ్చర్ల : జడ్చర్ల మున్సిపాలిటీలో ఇద్దరు యువతులు మిస్సయిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో యువతులు ఆచూకీ లేకుండా పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. జడ్చర్ల మున్సిపాలిటీలోని బుర్రెడ్డిపల్లి బృందావన్ కాలనీకి చెందిన దీవెన శంషాబాద్ దగ్గరలోని ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నది. రోజులాగే ఆదివారం కంపెనీకి వెళ్లేందుకు జడ్చర్ల బస్టాండులో యువతిని కుటుంబసభ్యులు బస్సు ఎక్కించారు.
అయితే ఆమె కంపెనీకి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో తమ బంధువులు, తెలిసిన వారిని విచారించారు. ఎక్కడా ఆచూకీ తెలియకపోవడంతో వారు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదుచేశారు. అదేవిధంగా జడ్చర్లలోని గౌరీ శంకర్ కాలనీకి చెందిన వనజ ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులు ఆదివారం ఉదయం కూలిపనులకు వెళ్లి రాత్రి 8:30 గంటలకు తిరిగొచ్చారు.
ఇంటి దగ్గర కుమార్తె కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారిని, బంధువులను వాకబు చేశారు. ఎవరూ ఆచూకీ చెప్పకపోవడంతో తల్లిదండ్రులు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.