జడ్చర్ల టౌన్, జూలై 25 : వ్యవసాయ పనులకు వెళ్తూ వాగు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరు యువతులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కొండేడు గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తుల కథనం మేరకు.. కొండేడు గ్రామానికి చెందిన పడకంటి అనూష, పడకంటి స్వాతి ఇద్దరూ మంగళవారం ఉదయం గ్రామ శివారులోని తమ పొలానికి బయలుదేరారు. ఈక్రమంలో దారి మధ్యలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో జారి పడిపోయారు. వాగు వద్ద బండరాయిపై టవల్, టిఫిన్ బాక్సులు పడి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వెంటనే గ్రామానికి చెందిన యువకులు వాగులోకి వెళ్లి యువతుల కోసం గాలించి మృతదేహాలను బయటకు తీశారు.
ప్రమాద విషయాన్ని తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేశ్‌బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జడ్చర్ల మార్చురీకి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతి చెందిన అనూష పదోతరగతి వరకు చదువుకోగా, స్వాతి ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇద్దరూ చదువు మానేసి వ్యవసాయ పనులకు వెళ్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య ఘటనా స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించారు. జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో ప్రభుత్వపరంగా వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
కొండేడు వాగులో పడి ఇద్దరు యువతలు మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న ఎస్పీ నర్సింహ వాగు వద్దకు వెళ్లి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొలానికి వెళ్తూ ఇద్దరు యువతులు వాగులో కొట్టుకుపోయి మృతిచెందటం బాధాకరమన్నారు. వాతావరణశాఖ సూచన మేరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అంచనా వేయకుండా వాగులు, నదుల్లోకి వెళ్లొద్దని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగత భద్రతను పాటించాలన్నారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.