అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 20 : వీధికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లో వెళ్తే.. బల్మూరు మం డలం లక్ష్మీపల్లికి చెందిన దేవి, కుమార్ దంపతుల కుమారుడు అఖిల్ (8) తండ్రి చనిపోవడంతో అమ్మమ్మ ఊరైన అచ్చంపేట మండలం బొల్గాట్పల్లిలో తాత శీలం ఎల్లయ్య వద్ద తల్లితో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఆడుకుంటున్న చిన్నారిపై ఆరు కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. కుక్కల దాడితో చిన్నారి తలభాగం, ఎడమ చెవిభాగం, కుడికాలిపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు గమనించి వెంటనే అచ్చంపేటలోని ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతున్నాడు.
పిల్లాడికి మెరుగైన వైద్యం అందించేందుకు తనవద్ద చిల్లిగవ్వ లేదని, దాతలు సహకరించాలని తల్లి దేవి వేడుకుంటున్నది. అదేవిధంగా హజీపూర్కు చెందిన శ్రీహరి, పద్మ దంపతుల మూడేళ్ల కూతురు శ్రేయ ఆరుబయట ఆడుకుంటుండగా, వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. చిన్నారితోపాటు మరో ముగ్గురు వృద్ధులపై కుక్కలు దాడిచేసి గాయపర్చాయని సర్పంచ్ అరుణమ్మ తెలిపారు. వీధికుక్కల బారి నుంచి చిన్నారులు, వృద్ధులను కాపాడాలని కోరారు.