మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 4 : ఉమ్మడి పాలమూరు జిల్లా విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) కష్టాలు వెం టాడుతున్నాయి. బాసర ఆర్జీయూకేటీ (రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నా లెడ్జ్ టెక్నాలజీస్)కి అనుబంధంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలోని రాజా బహద్దూర్రెడ్డి కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేసి నా ఈ విద్యా సంవత్సరం లో ప్రవేశాలకు కౌన్సెలి ంగ్ ఇక్కడే నిర్వహించకపోవడంతో ఉమ్మ డి పాలమూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి రాకపోకలు కొనసాగించాలంటేనే సుమారు 630 కిలోమీటర్ల దూరం అవుతుండగా.. నాగర్‌కర్నూల్ జిల్లాలోని అటవీప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలు సుమారు వెయ్యి కిలోమీటర్ల ప్రయాణించాల్సి వస్తుందని వాపోతున్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందుతుందనే ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరంలో బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీయూకేటీల్లో 1,691 సీట్లకుగానూ 31,896 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి విడుత ఎంపికైన వారి జాబితాను అధికారులు వెల్లడించారు.
మహబూబ్‌నగర్‌లోని ట్రిపుల్ ఐటీలో మొత్తం 181 సీట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటికి ప్రాథమికంగా ఎంపికైన వారికి మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ నిర్వహించకుండా అందరినీ బాసరకు రావాలంటూ అధికారుల సంక్షిప్త సందేశం. ప్రెస్‌నోట్ విడుదల చేయడం ఉమ్మడి పాలమూరు జిల్లావాసుల పాలిట శాపంగా మారిందని పలువురు నిరుపేద విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఈ నెల 5న ఫేజ్-1లో భాగంగా క్రమ సంఖ్య 1 నుంచి 564 మంది విద్యార్థులకు, ఈ నెల 6న క్రమసంఖ్య 565 నుంచి 1,128 వరకు, ఈ నెల 8న క్రమసంఖ్య 1,129 నుంచి 1,691 వరకు విద్యార్థుల సీరియల్ నెంబర్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లా వాసులకు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న భవనంలోనూ పూర్తిస్థాయిలో వసతులు సౌకర్యాలు కరవయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ట్రిపుల్ ఐటీలో సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు కరవయ్యాయి. ట్రిపుల్ ఐటీ ఏర్పాటుపై దృష్టి సారించిన పాలకులు అందులో సదుపాయాల కల్పనపై శ్రద్ధ చూపకపోవడం విడ్డూరంగా ఉందని ఉమ్మడి జిల్లావాసులు అంటున్నారు. ఏర్పాటై ఏడాది గడిచిపోయినా కొత్తగా ఎటువంటి వసతులు, సౌకర్యాలు సమకూర్చకపోవడంపై విద్యార్థులు సైతం పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రి పాలమూరు పర్యటన నేపథ్యంలోనైనా ట్రిపుల్ ఐటీపై ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించేలా చొరవ చూపాలని కోరుతున్నారు.
జడ్చర్ల మండలం చిట్టెబోయిన్‌పల్లి టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ గురుకులం) సమీపంలో జనవరి 17న ట్రిపుల్ ఐటీ కళాశాల భవన నిర్మాణానికి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్ల ప్రతిపాదనలతో ట్రిపుల్ ఐటీని 32.16ఎకరాల్లో నిర్మించనున్నట్లు ఇందులో జడ్చర్ల మండలానికి చెందిన 12.10 ఎకరాలు, మహబూబ్‌నగర్‌కు చెందిన 20.06 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కానీ నేటికీ ఒక్క అడుగు కూడా ట్రిపుల్ ఐటీ నిర్మాణ పనులు ముందుకు పడలే దు.. ప్రతిపాదిత రూ.200కోట్ల బడ్జెట్ కేటాయింపు, భూమి కేటాయింపు దస్ర్తాలు సైతం ఆర్జీయూకేటీ అధికారులకు అందనట్లు తెలుస్తోంది.