నారాయణపేట : స్వేచ్ఛ, స్వాతంత్య్రం మన సొంతం కావడానికి ఎంతో మంది ఈ గడ్డమీద అసమాన త్యాగాలు చేశారని, ఆనాటి త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ రాష్ట్రమని రాష్ట్ర పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, క్రీడలు యువజన సర్వీసులు ,మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి (Minister Vakiti Srihari) అన్నారు. నారాయణ పేట ( Narayanapeta ) కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ప్రజా పాలన ( Prajapalana) దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికి అమరులైన తెలంగాణ సాయుధ, రైతాంగ పోరాట యోధులకు , స్వాతంత్ర్ సమరయోధులకు నివాళి అర్పించారు. భారత దేశానికి స్వాతంత్ర్య౦ వచ్చే నాటికి దేశంలో 562 సంస్థానాలు ఉన్నాయనీ, వాటిలో మెజారిటీ సంస్థానాలు భారతదేశంలో విలీనమైనా ఝనాఘడ్, కశ్మీర్, హైదరాబాద్ సంస్థానాలు విలీనం కాలేదని అన్నారు.
అప్పట్లో తెలంగాణ మొత్తం ప్రాంతం మహారాష్ట్ర, కర్ణాటక లోని కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ సంస్థానం నిజాం పరిపాలనలో ఉండేదని వివరించారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర సంబరాల్లో కేరింతలు వేస్తుంటే హైదరాబాద్ సంస్థాన ప్రజలు స్వేచ్ఛ, స్వాతంత్య్రంనికై పోరాడుతూనే ఉన్నారన్నారు. ప్రజలపై రజాకార్ల, భూస్వాముల దాడులు పెరిగిన నేపథ్యంలో భారత దేశం లో కలవాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు అప్పటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ,హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయాలని నిజాంకు రాయభారం పంపారని వెల్లడించారు.
తమ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం చేసేందుకు నిజాం అంగీకరించక పోవడంతో 1948 సెప్టెంబర్ 13న ఆపరేషన్ పోలో పేరిట భారత సైన్యం రంగంలోకి దిగగా, ఓవైపు సాయుధ పోరాటం, మరోవైపు భారత సైన్యం రంగంలోకి దిగడంతో చేసేదేమీ లేక అప్పటి నిజాం 1948 సెప్టెంబర్ 17 న భారత యూనియన్ లో చేరుతానని ప్రకటించారని గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని, ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచి అమలు చేయడం ప్రారంభించిందన్నారు. నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం (NKLIS) ద్వారా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజక వర్గాల్లో మొత్తం లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రతిపాదించారని , ఈ ప్రాజెక్ట్ కోసం నారాయణపేట, దామరగిద్ద, ఉట్కూర్, మక్తల్ మండలాల్లోని పలు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్లు జారీ అయ్యాయని వివరించారు. ఈ పథకం సాగునీటి అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి, ఎస్పీ యోగేష్ గౌతమ్, జిల్లా అదనపు కలెక్టర్లు సంచిత్ గాoగ్వర్, శ్రీను, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ వార్ల విజయకుమార్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివారెడ్డి, ఆర్డీఓ రామచందర్ నాయక్ పాల్గొన్నారు.