మహబూబ్నగర్ అర్బన్, జూన్ 20 : యోగా అంటే.. జీవనయోగం.. ప్రపంచం మొత్తం యోగా చుట్టూనే తిరుగుతున్నది. అమెరికాలాంటి దేశాలు సైతం యోగాలోని వైద్య గుణాలను ఆమోదిస్తున్నాయి. ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతున్నది. అందుకే సాధనపై రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తున్నది. అందుకే నేడు ఎక్కడ చూసినా శిక్షణా కేంద్రాలు వెలుస్తున్నాయి.
దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒడిదు కులు, ఒత్తిళ్ల కారణంగా ఏదో ఒక అనారోగ్య సమస్యల బారిన మనిషి పడుతుంటారు. బీపీ, షుగర్, థైరాయిడ్, ఉబకాయం, అస్తమా, నరాల బలహీనత వంటి సమస్య లు ఎదుర్కొంటున్నారు. దీంతో దవాఖానల చుట్టూ తిరుగుతూ వేల రూపాయాలు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి రోగాల నియంత్రణకు యోగా ఆరోగ్య ప్రదాయినిగా ఉయోగపడుతున్నది. అందుకే వ్యాయామం, యోగా చేసే వారి సంఖ్య రోజురోజు కూ పెరుగుతోంది. పాలమూరు జిల్లా కేంద్రంలో యోగా శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. పిల్లలు, పెద్ద లు, మహిళలు, వృద్ధులు ఇలా అన్ని వయస్సుల వా రు యోగాపై అసక్తి చూపుతున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఏకాగ్రత కోసం అందరూ యోగాను ఆశ్రయిస్తున్నారు. ఇంతకు ముందు యోగా చేసే వారిలో ఎక్కు వ శాతం వయస్సు పైబడినవారు మాత్రమే ఉండేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. యువత కూడా యోగా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఆసనాలు వేయడంతో మానసిక ప్రశాంతత కలుగుతుండడంతో జీవితంలో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతామని యువత, వృద్ధులు చెబుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా యోగా చేయొచ్చు. నిరంతరం సూర్య నమస్కారాలు చేయడంతో ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ రోజు సమయాన్ని కేటాయించి యోగా చేస్తే వ్యాధులన్నీ దూరమవడం ఖాయమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
జూన్ 21న యోగా దినోత్సవాని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకొంటున్నారు. అంతకు ముందు నుంచి యోగాకు ప్రత్యేకత ఉన్నా.. ఈ మధ్యకాలంలో మరింత ఆదరణ పెరిగిందని చెప్పొచ్చు. ఇన్నాళ్లు కొన్ని వర్గాల వారికే పరిమితమైన యోగా ప్రస్తుతం అన్ని వర్గాలకు చేరుతున్నది. పాలమూరు జిల్లా కేంద్రంతోపాటు ఆయా ప్రాంతాల్లోని అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం యోగా సాధనలో భాగస్వాములు అవుతున్నారు.
ఇంతకు ముందు కొన్ని సంస్థలు యోగా శిక్షణ కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో యోగాపై ఆసక్తి పెరుగుతుండడంతో ఇటీవల పాలమూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్, బాయ్స్ జూనియర్ కళాశాల మైదానం, బాల కేంద్రంలో యోగా నేర్పుతూ పలువురిని సాధకులుగా తయారు చేస్తున్నారు. ఆయుష్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో కూడా ప్రత్యే శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి కేంద్రానికి శిక్షకులను కేటాయిస్తూ పారితోషికం అందిస్తున్నారు.
మనకు ఎంత పని ఉన్నా నిత్యం యోగాసనాలు తప్పకుండా వేయాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఎలాంటి వ్యాధులు వచ్చినా తట్టుకుని నిలబడే శక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత కూడా దక్కుతుంది. పిల్లల నుంచి మొదలు వృద్ధుల వరకు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం యోగా శిక్షణ అందరికీ అందుబాటులో ఉంటుంది. నిత్యం ఆసనాలు వేయడంతో మనస్సు రిలాక్స్ అవడంతోపాటు వ్యాధులు దూరం కావడం ఖాయం.
– కౌకుంట్ల రమేశ్, యోగా గురువు, పాలమూరు