Ugadi | కొల్లాపూర్, మార్చి 29 : ఉగాది తెలుగు వారి పండుగ మాత్రమే కాదు.. యుగ ఆరంభం అని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాఢ్యమి రోజు తెలుగు సంవత్సరం మారుతున్నది. వేద పండితులు గ్రహ నక్షత్రాల మేరకు పేర్ల బలంతోపాటు పంటల బలాన్ని సంవత్సర కాలం భవిష్యత్తుకు సంబంధించి పంచాంగం ద్వారా వివరిస్తుంటారు. అయితే తెలుగు వారు వైభవంగా జరుపుకొనే ఉగాదికి సృష్టి మనుగడతో సంబంధం ఉందని పురాణాల ద్వారా తెలుస్తున్నది. బహ్మదేవుడు సృష్టి ఆరంభంతోనే ఉగాది ద్వారా జీవుల జీవిత చక్రాన్ని నిర్మించారని భక్తుల విశ్వాసం.
అందుకే సృష్టి ప్రారంభమైన రోజు తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవుడు గ్రహ నక్షతాల గమనంతో సృష్టిని ప్రారంభించడంతో యుగం ప్రారంభమైందని ఆధ్యాత్మికవాదులు నమ్ముతారు. అందుకే ఎంతో విశిష్టత కలిగిన చైత్ర శుద్ధ పాఢ్యమి రోజు ప్రతి తెలుగు ప్రజలు ఇండ్లను శుభ్రం చేసుకొని ప్రతి గడపకూ మామిడి తోరణాలను అలకరిస్తారు. తల సాన్నాలను ఆచరించి.. కొత్త దుస్తులు ధరించి, పశు సంపదను సుందరంగా అలంకరించడంతోపాటు తమ వ్యవసాయ పొలాల్లో ఈ ఏడాది ఎవరి పేరు బలం బాగుంటుందో వారి చేత కొద్దిసేపు పని చేయించడం ఆనవాయితీ.
ఈ ఉగాదిలో మరో ప్రత్యేకత ఉగాది పచ్చడి అని చెప్పొచ్చు. దీన్ని షడ్రుచుల సమ్మేళనంగా పేర్కొంటారు. వేప పువ్వు, మామిడి కాయ, చింతపండు, బెల్లం, ఉప్పు, మిరపకాయల కలయికతో జీవితంలోని కష్టనష్టాలు, సుఖదుఃఖాలను.. జీవిత పరమార్థాన్ని ఉగాది పచ్చడిలో ఇమిడి ఉన్నట్లు పండుగ తెలియజేస్తుంది. పండుగను ఆదివారం నిర్వహించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా వాసులు అంతా సిద్ధమయ్యారు. శ్రీక్రోధి నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి.. విశ్వావసు నామసంవత్సరానికి స్వాగతం పలికనున్నారు.