అచ్చంపేట, జూలై 28 : రాష్ట్రంలోని అతిపెద్ద అటవీ ప్రాంతమైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పులుల సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తున్నది. నల్లమల అటవీ ప్రాంతం 2600 చ.కి.మీ. విస్తరించి ఉన్నది. ఇక్కడ వాటి జీవనానికి అనుకూలమైన సహజ వాతావరణాన్ని కలిగి ఉన్నది. అందుకే ఇక్కడ మొత్తం 36 పులులు నివాసం ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వీటిలో 20 ఆడపులులు, 13 మగ పులులు, 2 పులి కూనలు ఉండగా మరో పులి ఆడ, మగ అనేది నిర్ధారణ జరగలేదు. పులులు జన్యుపరంగా స్వచ్ఛమైన బెంగాల్ టైగర్ జాతికి చెందినవి పేర్కొంటుంటారు. అటవీశాఖ అధికారులు సీసీ కెమెరాల ద్వారా పులుల కదిలికల పర్యవేక్షణ చేస్తున్నారు. పగ్మార్క్ ట్రాకింగ్, డీఎన్ఏ నమూనాల సేకరణ, అక్రమ వేట నిరోధానికి చర్యలు చేపడుతున్నారు.
పులులు సుమారు 50-100 చ.కి.మీ. వరకు తిరుగుతుంది. పులి తిరిగే ప్రాంతంలో మూత్రం, గోరు ముద్రలు, చెట్లపై గోకుల ద్వారా గుర్తు చేస్తాయి. జింకలు, అడవిపంది, అడవి ఎడ్లు, పశువులను వేటాడి ఆహారంగా తీసుకుంటాయి. వేట సమయంలో పులి దాని జాడను నిశబ్దంగా వెంబడించి, చివరికి ఒక్క దాడితో చంపుతుంది. ఒకసారి పెద్ద వేట దొరికితే 3-5 రోజులు మళ్లీ ఆహారం అవసరం పడదు. ఆ సమయంలో నీరు మాత్రమే తీసుకుంటుంది. రోజులో ఎక్కువ సమయం పగటిపూట నిద్రపోతూ వేట కోసం రాత్రివేళ తిరుగుతుంది. పులి గర్భధారణ తర్వాత 3.5 నెలల గర్భకాలం(103, 105) రోజుల తర్వాత సాధారణంగా ఒకే సారి 2-4 పిల్లలకు జన్మనిస్తుంది. పిల్లలు 1.5 కిలోల మధ్య బరువుతో పుట్టి, చూపులేకుండా జన్మిస్తాయి. మాతృముద్దుతో పెరిగినా పిల్లలు 18-24 నెలల వరకూ తల్లి వెంట ఉంటాయి.
6 నెలల వయస్సు వచ్చే సరికి మాంసాహారం తినడం ప్రారంభిస్తాయి. ఈ కాలంలో తల్లి వేటలో శిక్షణ ఇచ్చి వాటిని స్వతంత్రంగా బతకగలిగేలా తయారు చేస్తుంది. పులి తన వాసన ద్వారా రోజు వారి తిరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. చెట్లకు గోకడం, మూత్రం విసిరడం, మూత్రగంధంతో సంకేతాలివ్వడం ద్వారా ఇతర పులులకు హెచ్చరిక ఇస్తుంది. పులి ఒకసారి సగటున 20-35 కిలోల మాంసం తింటుంది. మగపులి పొడవు 2.5 నుంచి 3.3 మీటర్ల వరకు ఉంటుంది. ఆడపులి 2.3 నుంచి 2.75 మీటర్ల వరకు ఉంటుంది. మగపులి 180- 300 కిలోల వరకు బరువు, ఆడపులి 100-160 కిలోల వరకు ఉంటుంది. అడవిలో 10-15 సంవత్సరాల వరకు జీవనకాలం ఉంటుంది.
ఓ మగపులి ఆడపులితో సుమారు 5-7 రోజులు సహవాసంలో ఉంటుంది. గర్భధారణ తర్వాత పుట్టే పిల్లలకు తల్లిశ్రద్ధగా సంరక్షణ చేస్తోంది. ఒక మగపులి 60-100 చ.కి.మీ. వరకు విస్తరించి తిరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇతర మగపులులు వస్తే గర్జిస్తుంది. పులికి వేటపైనా, వేగంపై దాడిపైన విశేషపట్టు ఉంటుంది. వేటకు సిద్ధమైతే 20 అడుగుల దాకా ఎగరగలదు. 50 కి.మీ. వేగంతో పరుగెత్తగలదు. పులి శరీరంపై ఉండే ఆకుపచ్చ రంగు ముడుతలు ప్రతి ఒక్క పులికి ప్రత్యేకంగా ఉంటాయి.
మనిషికి ఉండే ఫింగర్ప్రింట్లా గుర్తిస్తారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు నీటి వనరుల వద్ద దట్టమైన పొదలో విశ్రాంతి తీసుకుంటుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4గంటల వరకు పూర్తి నిద్రలో ఉంటుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు తన ప్రదేశం చుట్టూ తిరుగుతూ ఏరియాను పరిశీలిస్తుంది. రాత్రి 8 నుంచి ఉదయం 5 గంటల వరకు ప్రధానంగా వేట సమయం. నేడు అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఏటీఆర్లో పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని డీఎఫ్వో రోహిత్ గోపిడి తెలిపారు. పులుల సంఖ్య వాటి పునరుత్పత్తి విధానాల గురించి వివరిస్తామని డీఎఫ్వో తెలిపారు.