Tikka Veereswara Swamy | అయిజ, ఫిబ్రవరి 14 : తిక్కవీరేశ్వరుడి బ్రహ్మోత్సవాలకు వేళాయే.. పిలిస్తే పలికే దైవం.. కొలిచిన వారి కోర్కెలు తీర్చే భక్తులు కొంగు బంగారం.. తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అయిజ పట్టణంలో తిక్కవీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15 నుంచి 26 వరకు నిర్వహించాలని దేవస్థాన కమిటీ నిర్ణయించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. పట్టణంలోని పెద్ద వాగు సమీపంలో తిక్కవీరప్ప అనే మహాపురుషుడు నివసించి సిద్ధి పొందాడని ఇక్కడి భక్తుల విశ్వాసం. తిక్కవీరప్ప చూపిన మహిమలు కళ్లార చూసిన భక్తులు ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా తిక్కవీరేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ప్రతి ఏటా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జోగుళాంబ-గద్వాల జిల్లాలో తిక్క వీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించడం అనాదిగా వస్తుంది. బ్రహ్మోత్సవాలకు జిల్లా నలు మూలల నుంచి భక్తులు అశేష సంఖ్యలో తరలొచ్చి తిక్క వీరేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇందు కోసం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగు రంగుల విద్యుద్దీపాలను అలంకరించారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేశారు.
అయిజ పట్టణంలోని తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిక్కవీరేశ్వరస్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపు, కళశ స్థాపన, రాత్రి చట్టసేవ నిర్వహిస్తారు. 16న సాయంత్రం హోమం, రాత్రి ప్రభోత్సవం, 17న ఉదయం నిత్య పూజలు, రాత్రి 12.15 గంటలకు మహా రథోత్సవం నిర్వహించనున్నారు. 18న కోలాటాల ప్రదర్శన, 19న సందరాళ్లు ఎత్తు పోటీలు, అంతర్రాష్ట్ర భజన పోటీలు, 20న జాతీయ స్థాయి కుస్తీ పోటీలు, 21న అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పొట్లాట పోటీలు, 22న పాలపళ్ల విభాగం పశుబల ప్రదర్శన, 23న సేద్యపుటెద్దుల విభాగం పశుబల ప్రదర్శన, 24న సీనియర్స్ విభాగం పశుబల ప్రదర్శన, గత ఏడాది పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులకు సత్కారం, 26న మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఢీ ప్రోగ్రాం ఉంటుందని ఆలయ వ్యవస్థాపక వంశీయులు పాగుంట లక్ష్మిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.