నాగర్కర్నూల్, జూలై 28 : నాగర్కర్నూల్ మున్సిపల్ పరిధిలోని ఉయ్యాలవాడ గ్రామ శివారులోని మహాత్మాజ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకులంలో మరో ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం తెల్లవారుజామున కడుపునొప్పితో బాధపడుతున్న ముగ్గురిని సిబ్బంది ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయి ంచి తిరిగి పాఠశాలకు తీసుకెళ్లారు. ఫుడ్ఫాయిజన్ ఘటనతో పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక హెల్త్ క్యాంప్ కొనసాగుతుంది. కాగా శనివారం రాత్రి ఘటన జరిగితే ఇప్పటికీ ఫుడ్ఫాయిజన్ సమస్య కొలిక్కిరాలేదు. పులిసిన పెరుగు, పకోడీ, ఉడికీ ఉడకని అన్నం పెట్టారని అస్వస్థతకు గురైన విద్యార్థినులు చెప్పిందేకానీ ఇప్పటి వరకు ఏ ఒక్క ఫుడ్సేఫ్టీ అధికారులు వచ్చి అధికారికంగా ప్రకటించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది.
దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం సైతం పాఠశాల లోపలికి తల్లిదండ్రులను వెళ్లనీవకుండా అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. చాలాసేపటి తర్వాత తల్లిదండ్రులను ఒక్కొక్కరిని లోపలికి పంపించడంతో తమ పిల్లలకు సేఫ్టీ లేదన్న కారణంతో పాఠశాల నుంచి తీసుకెళ్లిపోయారు. ఆదివారం దాదాపు 150మంది విద్యార్థినులు మూటాముళ్లే సర్దుకొని వెళ్లిపోగా సోమవారం కూడా చాలా మంది ఇంటిబాట పట్టారు. మొత్తం పాఠశాలలో 742మంది విద్యార్థినులకు గానూ ఇప్పటి వరకు దాదాపు 350 నుంచి 400 మంది ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకే రోజు ఒకే పాఠశాలలో ఏకంగా వందకుపైగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఇదే ప్రథమం కావడంతో ఒక్కసారిగా పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులు భయబ్రాంతులకు గురై ఉలిక్కిపడ్డారు.
ధైర్యం చెప్పి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిందిపోయి పిల్లల్ని తీసుకెళుతామంటే పంపిం చి వేస్తున్నారు. తమ పిల్లల్ని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులను లోపలికి పంపించకపోవడంతో ఏం జరుగుతుందోనని తల్లిదండ్రులు మరింత భయానికి గురయ్యే పరిస్థితులు దాపురించాయి. ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా ఫుడ్ఫాయిజన్ ఏ కారణం చేత అయ్యిందని అధికారికంగా ప్రకటించకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఏదేమైనా భయానికి గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు అవెర్నెస్ కల్పించి, ఫుడ్ఫాయిజన్ జరగడానికి బాధ్యులు ఎవరన్నది గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.