ఉండవెల్లి, ఏప్రిల్ 5: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి అమాయకుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసుకొని మో సం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితులు, ఎ స్సై బాలరాజు కథనం మేరకు.. ఉండవెల్లి మండలం మారమునగా ల-1 గ్రామానికి చెందిన చిన్న సుంకేసులు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. చిన్న కుమారుడు శివకుమార్‌కు రైల్వేశాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని తక్కశిలకు చెందిన రామ్మోహన్, సాయికార్తీక్, పి.వెంకటేశ్(కర్నూలు జిల్లా వ్యక్తి) రూ. 14లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
మొదటి విడుతగా రూ. లక్షా 70వేలు, రెండో విడుతలో రూ.7లక్షలు రామ్మోహన్, సాయికార్తీక్‌కు ఇచ్చి వంద రూపాయల ప్రాంసరీ బాండ్‌పై రాయించుకొని డబ్బులిచ్చారన్నారు. మిగతా రూ.ఐదులక్షల 30వేలు ఉద్యోగం పర్మినెంట్ అయిన ఆరునెలల్లో ఇచ్చేలా ఒప్పందం కుదిరిందన్నారు. కానీ ఉద్యోగంలో చేరక ముందే రూ.ఐదు లక్షలు ఇవ్వాలని కోరగా జాబ్ ఆర్డర్ కాపీ లేకుండా మొత్తం డబ్బులు ఎలా ఇవ్వాలని శివకుమార్ కుటుంబసభ్యులు అడగగా సాయికార్తీక్ పేరుపై అలంపూర్ చౌరస్తాలో ఉన్న ప్లాట్ డాక్యుమెంట్లను ఇచ్చి తాకట్టు పెట్టారు. 2022 మార్చిలో మిగిలిన రూ.ఐదు లక్షల 30వేలను వారికి ఇచ్చారు. మొత్తం రూ.14లక్షలు తీసుకొని కాంట్రాక్ట్ బేసిక్ కింద ఉద్యోగం చేయాలని ఏపీలోని గుంటూర్ జిల్లా నల్లపాడు రైల్వేస్టేషన్లో అవుట్ సోర్స్ ఉద్యోగం చేయించారు.
మూడు నెలలు ఉద్యోగం చేయగా మొదటి నెల రూ.29వేలు, రెండో నెలలో రూ.18వేలు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులు వేశారన్నారు. డిగ్రీ సర్టిఫికెట్స్ ఉంటే రైల్వే టీసీ ఉద్యోగం వస్తుందని శివకుమార్‌ను నమ్మించడంతో మరో రూ.మూడు లక్షలు వెంకటేశ్‌కు ఇచ్చారని తెలిపారు. మొత్తం రూ.17లక్షలు తీసుకొని 20 రూపాయల ఖాళీ బాండ్‌పై శివకుమార్‌తో సంతకం చేయించుకున్నారు. మూడు నెలల తర్వాత ఉద్యోగం లేక ఇంటికి వచ్చిన శివకుమార్ తమ డబ్బులు ఇవ్వాలని వారిని కోరగా జాబ్ గ్యారెంటీగా వస్తుంది.. రేపు మాపంటూ కాలం వేళ్లదీశారని పేర్కొన్నారు.
ఇదే అదునుగా భావించిన సదరు వ్యక్తులు శివకుమార్ ఇచ్చిన డబ్బులు తీసుకొని ప్లాట్ డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని కోర్టు ద్వారా ఆరుగురికి నోటిసులు జారీ చేశారు. కాగా ఇదే ముగ్గురు వ్యక్తులు శివకుమార్‌తోపాటు కర్నూలు జిల్లా పసుపుల గ్రామానికి చెందిన కాంతన్న కొడుకు హరీశ్ నుంచి రూ.17లక్షలు ఉద్యోగం పేరిట తీసుకోవడం కొసమెరుపు. లాయర్ నోటీసుతో మోసపోయామని గ్రహించిన శివకుమార్ కుటుంబసభ్యులు ఎస్సై బాలరాజుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. అప్పు చేసిన రూ.17లక్షలు, అందుకు వడ్డీ ఎలా కట్టాలో తెలియక అయోమయంలో శివకుమార్ తండ్రి సుంకేసులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మోసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వారు కన్నీటి పర్యంతమయ్యారు.