ఉరుకులు పరుగుల జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన సంపాదనలో దాదాపు 60 శాతం వైద్యానికి ఖర్చు పెడుతున్న సందర్భాలు ప్రస్తుతం ఎన్నో ఉన్నాయి. జ్వరం వచ్చి తగ్గకపోతే పలు రకాల రక్త పరీక్షలు రాస్తున్నారు. దీంతో కార్పొరేట్లో మందులకు అయ్యేదానికంటే ఎక్కువగా టెస్టులకే ఖర్చవుతున్నది. అలాంటి వ్యవస్థకు చెక్ పెట్టేందుకు తెలంగాణ స ర్కార్ ప్రభుత్వ దవాఖానల్లో అన్నిరకాల వైద్య సేవలను అందిస్తున్నది. దీంతో ఒకప్పుడు సర్కార్ దవాఖాన అంటే భయపడిన ప్రజలు ఇప్పుడు ధైర్యంగా వెళ్లి అక్కడి వసతులను చూసి ప్రశంసిస్తున్నారు. టెస్టుల కోసం ప్రైవేట్ ల్యాబ్‌లలో ఖర్చు భరించలేని పేదల కోసం ప్రభుత్వం టి డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈక్రమంలోనే వనపర్తిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం వెనుకభాగంలో ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
– వనపర్తి, మే 10
ఉమ్మడి రాష్ట్రంలో నాడు ప్రభుత్వ దవాఖానలో వైద్యం చేయించుకోవాలంటే ప్రజలు భయపడే పరిస్థితి.. రెండు మాత్రలు ఇచ్చి చేతులు దులుపుకొంటారు.. అక్కడికి వెళ్లేకంటే ఇక్కడే ఏదో ప్రైవేట్ ద వాఖానకు పోవడం మంచిదని అనుకునేవారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభు త్వం వైద్యరంగంలో ఎన్నో విప్లమాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అమ్మ ఒడి, కేసీఆర్ కి ట్ వంటి పథకాలను తీసుకొచ్చి వైద్య సేవలపై ప్రజలకు భరోసా ఇస్తున్నది. దీంతో కార్పొరేట్ కన్నా ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రో గుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ప్రభుత్వం అత్యాధునిక వైద్య పరికరాలతో కూడిన తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. వీటి ఏ ర్పాటు పేద, మధ్యతరగతి ప్రజలకు వరంలా మారనున్నది.
ప్రభుత్వ దవాఖానలో అన్ని రకాల టెస్టులు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ల్యాబ్‌ల ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో అక్కడక్కడా ప్రైవేట్ ల్యాబ్‌లు ఉండగా ఇప్పుడు ప్రతి ప్రైవేట్ దవాఖానలోనూ ఓ ల్యాబ్ ఏర్పాటు చేసుకొని ప్రజలు నుంచి టెస్టుల పేరుతో వేల రూపాయలు దండుకుంటున్నారు. మందుల ఖర్చు కన్నా టెస్టులకే ఎక్కువగా ఖర్చు అవుతోందని రోగులు వాపోతున్నారు. పేదలకు రోగ నిర్ధారణ పరీక్ష ఫీజుల భారాన్ని తగ్గించి.. పరీక్షల పేరిట ప్రేవేట్ దవాఖానలు చేస్తున్న దోపిడీకి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం టీ డయాగ్నొస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తుంది. రూ.కోటీ25 లక్షలతో నిర్మిస్తున్న ఈ కేంద్రంలో 57 రకాల పరీక్షలను ఉచితంగా చేస్తారు.
డయాగ్నొస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేయొచ్చు. చికున్ గున్యా, మలేరియా, డెంగ్యూ, షుగర్, టై ఫాయిడ్, రక్తం, మూత్రం, అవయవ పనితీరు, థైరాయిడ్, లివర్, కిడ్నీ పనితీరు, కొలెస్ట్రాల్ వంటి 57 రకాల పరీక్షలను చేస్తారు. పీహెచ్‌సీలు, ప్రభుత్వ దవఖానల నుంచి వచ్చే శాంపిళ్లను సైతం పరీక్షించి రిపోర్టులు ఇవ్వడంతోపాటు రోగి మొబైల్‌కు రిపోర్ట్ పంపించనున్నారు. ఈ కేంద్రంలో చేసే ప్రతి పరీక్షనూ రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వైద్య నిపుణులు పర్యవేక్షిస్తారని.. హైదరాబాద్ కేంద్రంగా రిపోర్టులను పరిశీలిస్తారని వైద్యులు చెబుతున్నారు. పరిశీలించిన తర్వాతే స్థానిక నిర్ధారణ పరీక్షా కేంద్రానికి నివేదిస్తారని అంటున్నారు. భ వన నిర్మాణ పనులు పూర్తికాగా.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రైవేట్ ల్యాబ్‌లలో టెస్టులకు అ య్యే ఖర్చు భరించలేని పేద ప్రజల కోసం ప్రభుత్వం టీ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగానే వనపర్తిలోని మాతాశిశు సంరక్షణ కేంద్రం వెనుక భాగంలో ఈ సెంటర్ భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సెంటర్ ప్రారంభం కానున్నది. సెంటర్ ప్రారంభం కాగానే పేదలకు 57 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తారు. ఈ కేంద్రం నుంచి అందే సేవలను పేదలు సద్వినియోగం చేసుకోవాలి. – నరేందర్‌కుమార్,
జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్, వనపర్తి