గద్వాల అర్బన్, ఏప్రిల్ 15 : జోగుళాంబ గద్వాల జిల్లా లో రైస్‌మిల్లుల నిర్వాహకుల వ్యవహారం రోజురోజుకూ మితీమిరిపోతుందన్న విమర్శలు ఉ న్నాయి. ప్రభుత్వం పేదలకు స న్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని అందుకు తగ్గ ట్టు రైతులతో సన్న వడ్లు కొనుగో లు చేసి మిల్లులకు సరఫరా చేస్తున్నది. మిల్లు నిర్వాహకులు వడ్లను మర ఆడించి.. ఎఫ్ఆర్కే బియ్యం కలిపి గోదాం తరలించాలి.. అక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి. కానీ అందుకు భిన్నంగా మిల్లర్లు వ్యవహరిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నా యి. క్వింటా బియ్యంలో 25 శాతమే నూకలు కలపాలని నిబంధనలు ఉ న్నా.. మిల్లు నిర్వాహకులు ప్రభుత్వం చెప్పిన దాని కంటే అధికంగా క్వింటాకు 40 శాతం నూకలు కలుపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి మర ఆడించిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించి మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
నెలకు 4 వేల మెట్రిక్ టన్నుల పంపిణీ
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం రేషన్ షాపులు 332 ఉన్నాయి. ఈ దుకాణాల్లో ప్రతి నెలా 4 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు డీలర్లుపంపిణీ చేస్తుంటారు. ఏప్రిల్ నెలలో ఒకేసారి మూడు నెలల కోటా విడుదల చేయడంతో 12 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పేద లబ్ధిదారుల చెంతకు చేరనున్నది.
మామూళ్లు ముడితేనే..
గద్వాల జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని రేషన్ దుకాణాల్లో వారం రోజులుగా బియ్యం పంపిణీ కొనసాగుతోంది. తీసుకున్న సామా న్య ప్రజలు బియ్యాన్ని చూసి అవాక్కవుతున్నారు. మిల్లుల నుంచి గోదాంలకు తరలిన తర్వాత బియ్యం నాణ్యతను గోదాం నిర్వాహకులు పరిశీలించాల్సి ఉంటుంది. కానీ పరిశీలించకుండానే బియ్యం పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో వాహనం బియ్యం లోడ్ పాసైతే గోదాం నిర్వాహకులకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు మామూళ్లు ముడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బియ్యంలో ఎక్కువ మొత్తంలో నూకలు కనిపిస్తే పైకం ఎక్కువ ఇవ్వాలి.. త క్కువ శాతం నూకలు కనిపిస్తే.. తక్కువ పైకం చెల్లించాల ని గోదాం నిర్వాహకులు బాహాటంగా మిల్లర్లను అడుగుతున్నట్లు సమాచారం.
ఈ మధ్యే జిల్లా కేంద్రంలోని కొండపల్లి రోడ్డు సమీపంలో ఉన్న మిల్లుకు చెందిన బియ్యం లోడ్ గోదాంకు వెళ్లగా.. బియ్యంలో నూకలు ఎక్కువ కలిపారు.. పైకం ఎక్కువ చెల్లించాలన్న విషయంలో ఇరువురి మధ్య పంచాయితీ జరిగినట్లు తెలిసింది. తీరా ఓ లెక్క ఇచ్చి గోదాం నిర్వాహకులను సదరు మిల్లు నిర్వాహకుడు కూల్ చేశారట. కాగా రైస్ మిల్లు నిర్వాహకులతో జిల్లాలోని అన్ని గోదాం నిర్వాహకులు సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మిల్లు నుంచి బియ్యం లోడ్ వెళ్లే వాహనం నెంబర్ చెబితే చాలు.. క్షణాల్లో లోడ్ అన్లోడ్ అవుతుంది. గోదాం నిర్వాహకులు నెలకు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్లు సమాచారం. అక్కడ పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉండడంతో గోదాం డ్యూటీలకు వెళ్ల్లేందుకు అధికారులు పోటీపడ్తున్నారట.
విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం..
బియ్యంలో అధిక మొత్తంలో నూకలు కలుపుతున్న విషయంపై దృష్టి సారిస్తాం. సంబంధిత అధికారులకు విషయం చెప్పి మిల్లులతోపాటు గోదాంల్లో ఉన్న బియ్యాన్ని పరిశీలిస్తాం. నాణ్యత లేకుండా బియ్యాన్ని తరలించే మిల్లులపై చర్యలు తీసుకుంటాం. అలాగే నాణ్యత లేని బియ్యాన్ని డబ్బులు తీసుకొని అన్లోడ్ చేస్తున్న వారిపై నిఘా పెట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పేదలకు నాణ్యమైన బియ్యం అందజేయడమే లక్ష్యం.
– లక్ష్మీనారాయణ, అదనపు కలెక్టర్, జోగుళాంబ గద్వాల జిల్లా