మక్తల్ : మక్తల్ ( Maktal ) పట్టణంలోని న్యూ రాఘవేంద్ర కాలనీలో ఉన్న శ్రీ జగద్గురు తింతిని మౌనేశ్వరా స్వామి దేవాలయంలో (Mauneswara Swamy Temple) శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయ అర్చకులు విష్ణుమూర్తి చారి, ఆలయ అధ్యక్షులు శ్రీనివాసచారి, మాజీ అధ్యక్షులు రాజు అందించిన సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న తింతిని మౌనేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దొంగలు చొరబడి, పంచలోహ విగ్రహం, వెండి వినాయక విగ్రహం, దీపాలను, స్వామివారి వెండి కన్నులను, హుండీలో రూ. 2 లక్షల పైగా నగదును దోచుకెళ్లారని తెలిపారు.
శనివారం ఉదయం బాలకృష్ణ చారి ఆలయం ప్రధాన గేటుకు తాళం విరగొట్టిన విషయాన్ని గుర్తించి ఆలయ అధ్యక్షులు శ్రీనివాసులకు సమాచారం అందజేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మి రెడ్డి ఆలయాన్ని సందర్శించారు. క్లూస్ టీం ద్వారా దొంగలను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్సై వెల్లడించారు.