మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జూన్ 11 : యువతే దేశ భవిష్యత్ అని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డావీ బాలకిష్టారెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ పీఈ సెట్)-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫిజికల్ ఎఫిషియోన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్‌లు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ టీజీ పీఈసెట్ నిర్వహించడం పాలమూరు యూనివర్సిటీకి గర్వకారణం అన్నారు.
ఎంపికలు పూర్తి పారదర్శకంగా ఉండాలని సంబంధిత అధికారులకు సూచించా రు. దేశంలో యువత అధిక భాగంలో ఉన్నారని యు వత సక్రమ మార్గంలో ఉంటే దేశ భవిష్యత్ బాగుంటుందన్నారు. త్వరలో ఉపాధి ఆధారిత కోర్సులు ప్రవేశ పెడుతున్నామని తెలిపారు. అనంతరం వివిధ ఈవెంట్లను ప్రారంభించి పరిశీలించారు. పాలమూరు యూనివర్సిటీ పూర్వపు ఉపకులపతి ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ మాట్లాడుతూ అభ్యర్థుల సామర్థ్యాలు కచ్చితత్వంతో అంచనా వేయాలని నిర్వహణ అధికారులు, పర్యవేక్షకులు, పరిశీలకులకు సూచించారు.
మొదటి రోజు బీపెడ్లో 515 మంది విద్యార్థులకు గానూ 368 మంది, డీపెడ్ కోర్సులో 217 మంది విద్యార్థులకు గానూ 149 మంది హాజరయ్యారని టీజీ పీఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్ తెలిపారు. కార్యక్రమాల్లో పీయూ వైస్ చాన్స్‌లర్ శ్రీనివాస్, రిజిస్ట్రార్ రమేశ్‌బాబు, సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రవికుమార్, పీయూ ఫిజికల్ డైరెక్టర్ శ్రీనివాసులు, సభా నిర్వహణ బాధ్యతల అధికారి భూమయ్య, పీయూ పీఆర్వో రవికుమార్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి జ్ఞానేశ్వర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.