టమాట ధర మాట రానీయడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సామాన్యుడు ఈ పేరెత్తితే బెదిరిపోయే పరిస్థితులు దాపురించాయి. వారం కిందటి వరకు రూ.50 వరకు ఉన్న టమాట కిలో ధర ఏకంగా రెట్టింపై రూ.100కు చేరింది. సామాన్యులు బెంబేలెత్తిపోతుండగా.. పేదలు కొనలేని దుస్థితి. దీనికితోడు అన్ని కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏం కొనలేని.. ఏం తినలేని పరిస్థితి ఏర్పడిందని మహిళలు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇటు ప్రజలతోపాటుగా అటు వ్యాపారులు, ఏజెన్సీల నిర్వాహకులకూ వంటల్లో మోయలేని భారంగా మారింది.
టమాట ధర రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాట ఇప్పుడు వంటింట్లోకే రానంటోంది. గత వారం కిందట రూ.30నుంచి రూ.50వరకు పలికిన కిలో టమాట ధర ఇప్పుడు ఏకంగా రెట్టింపయ్యింది. నాగర్‌కర్నూల్ రైతుబజార్లో రూ.100కు కిలో టమా ట ధర పలకడం గమనార్హం. గత కొద్ది రోజులుగా కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీనివల్ల సామాన్యులకు ముఖ్యంగా శాఖాహార ప్రియులకూ పెరిగిన ఈ ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాలకూర, తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు గతంలో రూ.10కి 5 కట్టల చొప్పున ఇవ్వగా ఇప్పుడు రూ.20కి 3లేదా 4, 5చొప్పున అమ్ముతున్నారు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఓ స్థాయికి చేరగా మిర్చి ధర రూ.100దాటి అటు, ఇటుగా మారుతోంది. ఉల్లి కూడా ఘాటెక్కింది. ఏ వంటకంలోనైనా ఖచ్చితంగా ఉపయోగించే టమాట ఏకంగా రూ.100కు చేరడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఈసారి వానకాలంలో సరైన వర్షాలు కురియకపోవడంతో కూరగాయల ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ వానకాలంలోనైనా సకాలంలో వర్షాలు కురిస్తే ఈ ధరలు కాస్త తగ్గుతాయని ఆశించిన ప్రజలకు వరుణుడు దయ చూపడం లేదు. కాగా గత పదిహేను రోజుల కిందట కురిసిన భారీ వర్షాలకు అప్పటికే తోటల్లో ఉన్న టమాట పంట దెబ్బతిన్నది. ప్రస్తుతం చాలా వరకు గ్రామాల్లో కూరగాయలు ముఖ్యంగా టమాట రైతు బజార్లకు, మార్కెట్లకు రా వడం లేదు.
ఇతర ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని రైతు బజార్లకు రైతులు, వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం చేరిన ధరతో రైతు రూ.100నోటు ఇస్తేనే టమాట ఇంటికి వస్తాననే పరిస్థితులు రావడం విశేషం. పెరిగిన ధరలతో సామాన్యు ల పరిస్థితి ఇలా ఉంటే మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, హాస్టళ్లు, గురుకులాల్లో విద్యార్థులకు చేసిపెట్టే భోజనాలపై కూడా ఈ ప్రభావం చూపుతున్నది. టమాటలు లేకుండా వంటకాల చేసే పరిస్థితులు రావడంతో విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందే పరిస్థితులు దూరమయ్యాయి. నాగర్‌కర్నూల్ ప్రాంతానికి రైతులు మదనపల్లి మార్కెట్ నుంచి టమాటలు తీసుకొస్తున్నారు. అక్కడ కూడా రూ.60, రూ. 80చొప్పున కొనుగోలు తీసుకొస్తుండటంతో రవాణా, ఇతర ఛార్జీలను కలుపుకొని వ్యాపారులు రూ.100కు కిలో చొప్పున టమాటలు విక్రయిస్తున్నారు. స్థానికంగా టమాటలు దొరక్కపోవడంతో టమాట ధరలు పెరిగాయి. ప్రస్తుతం నాగర్‌కర్నూల్ రైతుబజార్లో సాధారణ రైతులెవరూ టమాటలు అమ్మడం లేదు. పది మంది వరకు రైతులే టమాటలను విక్రయిస్తున్నారు. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం, పది రోజుల్లో టమాట ధరలు రూ.200వరకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాగా వర్షాకాలం వస్తే కూరగాయల ధరలు తగ్గుతాయని భావిస్తున్న సామాన్యులకు పెరిగిన ఈ టమాట మంటలు వంటింట్లో మంటలను పుట్టిస్తోంది.
కూరగాయలు కొనేందుకు రైతుబజార్‌కు వచ్చాం. టమాటనే రూ.100కిలో అంటున్నారు. ఒక్క టమాటలే కొంటే మిగిలిన కూరగాయలను ఎలా కొనాలి. ఒక్క పావు కిలో టమాటలే కొన్నాను. రైతుబజార్లో కొందరే టమాటలు అమ్ముతున్నారు. కొన్ని రోజులైతే ఈ టమాటలు కూడా దొరకవని అంటున్నారు.
ఇంట్లో వంటల కోసం వస్తే టమాట కిలో రూ. 100అంటున్నారు. పాడైన టమాటలు రూ.70-రూ.80అంటున్నారు. ఈ ట మాటలు కూడా బాగా పండిపోయాయి. టమాటలు లేకుండా వంటలు చేసుకోలేము. ఎక్కువ రోజులు కూ డా ఇంట్లో ఉంచుకోలేం. టమాటల ధర, పండిపోయిన వాటిని చూసి కొనుక్కోలేదు.