అయిజ, ఫిబ్రవరి 14 : పొట్టేళ్ల పొట్లాట పోటీలు రసవత్తరంగా సాగాయి. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయ ప్రాంగణంలో దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పోటీలను నిర్వహించారు. పోటీలకు 12 పొట్టేళ్లు తరలొచ్చాయి. ఒకదానికొకటి తలపడుతుండగా చూసేందుకు ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెద్ద పెద్ద పొట్టేళ్లతో సాగిన పోరు చూపరులను ఆకట్టుకున్నది.
పోటీలను ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి హైదరాబాద్కు చెందిన అలీ (పుష్పరాజ్) (రూ. 20,016), రెండో బహుమతి కర్నూల్ జిల్లా బీ.తాండ్రపాడుకు చెందిన పరశురాముడు (రూ.15,016), మూడో బహుమతి జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కొంకల గ్రామానికి చెందిన మా బాషా (రూ.10,016), నాల్గో బహుమతి కర్నూల్ జిల్లా బీ.తాండ్రపాడు గ్రామానికి చెందిన హనుమాన్ (రూ.5,016) పొట్టేళ్లు బహుమతులు గెలుచుకున్నాయి. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు విజేతలకు నగదు బ హుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, భక్తులు పాల్గొన్నారు.