వనపర్తిరూరల్, జనవరి 2 : హైకోర్టును తప్పుదారి పట్టించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని సర్వే నెంబర్ 200పై తప్పడు వివరాలతో హైకోర్ట్‌లో మాజీ జెడ్పీటీసీ ఏర్పుల వెంకటయ్య రిట్ వేశాడు. జిల్లా కేంద్రానికి ప్రభుత్వ విద్యాసంస్థలు రాకుండా అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. సర్కార్ భూమి (సర్వే నెంబర్ 200) పై కన్నేసి నాలుగేండ్లుగా వివిధ కోర్టుల్లో తప్పుడు పిటీషన్లు దాఖలు చేశాడు. ఖాళీగా ఉన్న సదరు భూమిని కబ్జా చేసి కాజేయాలని కొందరి పేదల పేరిట గతంలో విశ్వప్రయత్నం చేశాడు. అలాగే జిల్లా కోర్టులకు సంబంధించిన సముదాయానికి ప్రభుత్వం కేటాయించిన 25 ఎకరాలను కూడా కబ్జా చేయాలని చూశాడు. వెంకటయ్య టీడీపీలో క్రీయాశీలంగా వ్యవహరించేవాడు. గతంలో ప్రజల నుంచి సేకరించిన ఆధార్ కార్డులు, ఇతర ధ్రువపత్రాలతో వారికి తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో వివిధ కోర్టుల్లో పిటీషన్లు వేశాడు.
కాగా, హైకోర్టును తప్పుదారి పట్టించినందుకు వెంకటయ్యపై చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం మేరకు.. జిల్లా కోర్టుల సముదాయానికి ప్రభుత్వం 25 ఎకరాలను కేటాయించగా, కబ్జా చేసేందుకు వెంకటయ్య ప్రయత్నించాడు. అయితే, ప్రభుత్వం ఆ భూమిని మెడికల్ కళాశాల, ఇతర ప్రభుత్వ భవనాల కోసం సర్వే చేసే క్రమంలో కబ్జాలో ఉన్న వారిని ఖాళీ చేయించి, కొంత పరిహారం తీసుకొని అభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించింది. కాగా, కబ్జా చేసిన భూమి సర్కార్కే వెళ్తుందని భావించిన వెంకటయ్య.. సదరు భూమి మానకే వచ్చేలా చేస్తానని నాగవరం గ్రామానికి చెందిన కొందరు రైతులను నమ్మబలికి నాలుగేండ్ల కిందట 12 మంది ఆధార్‌కార్డులు, సంతకాలను తీసుకొని కోర్టులో కేసులు వేశాడు.
అంతలోపే ప్రభుత్వం రైతులతో చర్చలు జరిపింది. దీంతో రైతులు వెంకటయ్య వద్దకు వెళ్లి తమ ఆధార్‌కార్డులు, సంతకాలు చేసిన పేపర్లు ఇవ్వాలని కోరినా.. ఇప్పటివరకు వారికి ఇవ్వలేదు. నాగవరం గ్రామానికి చెందిన జె.యాదగిరి, ఎం.నాగేశ్వర్, ముష్టి గోపాల్, ముష్టి అడివన్న, కె.ఆంజనేయులు, కె.రాములు, కె.వెంకటేశ్, చీర్ల రాములుతోపాటు చనిపోయిన ముష్టి ఆంజనేయలు, ముష్టి నాగన్న పేర్లమీద ఫోర్జరీ సంతకాలతో డిసెంబర్ 14వ తేదీన హైకోర్టులో వెంకట్య రిట్ పిటీషన్ (46223/2022) దాఖలు చేశాడు. హైకోర్టులో తమకు తెలియకుండా పిటీషన్ దాఖలు చేశారని అదే నెల 19వ తేదీన ముష్టి నాగేశ్వర్, ముష్టి కిష్టన్న రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో వెంకటయ్యను అదుపులోకి తీసుకొని సెక్షన్లు 419, 420, 468, 471 కింద కేసు నమోదు చేసి రిమాండ్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. అంతేకాకుండా మల్లన్నసాగర్ రిజర్వాయర్ మీద కూడా వెంకటయ్య గతంలో కోర్టులో అక్రమ కేసులు వేసినట్లు పేర్కొన్నారు.