ఊట్కూర్ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని బిజ్వారం గ్రామంలో పీవైఎల్(PYL) , పీడీఎస్యూ(PDSU) , మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం భగత్ సింగ్ ( Bhagat Singh ) 94వ వర్ధంతిని నిర్వహించారు. పుర వీధుల గుండా విద్యార్థులు, యువకులు ప్రదర్శన నిర్వహించి భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎం కృష్ణ, పార్టీ డివిజన్ కార్యదర్శి సలీమ్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దు మాట్లాడుతూ.. బానిసత్వం నుంచి స్వేచ్ఛ స్వతంత్రo కోసం పోరాడినందుకే భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లను నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23 న ఉరి తీసిందన్నారు. స్వతంత్రం సిద్ధించి 78 ఏండ్లు గడుస్తున్నా దేశంలో సగటు మనిషి జీవితంలో మార్పు రాలేదన్నారు.
షహీద్ భగత్ సింగ్ కలలుగన్న సమానత్వం సిద్ధించలేదన్నారు. ఒక మనిషిని వేరొక మనిషి దోపిడి చేయడాన్ని భగత్ సింగ్ నిరసించారని, దేశ స్వతంత్రం కోసం కుల, మతాలకతీతంగా హిందూ ముస్లిం భాయ్ భాయ్ ..జై జవాన్, జై కిసాన్ అంటూ దేశభక్తితో పోరాడి ప్రాణ త్యాగం చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ హక్కులను కాలరాస్తు ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో యువత చైతన్యవంతమై దేశ సంపదను కొల్లగొడుతున్న వారికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీవైఎల్, పీడీఎస్యూ నాయకులు ఎల్లప్ప, తిమ్మప్ప, గోవర్ధన్ రెడ్డి, తిరుమలేష్ పాల్గొన్నారు.