మక్తల్ టౌన్, జూన్ 25 : ఆర్థికంగా వెనుకబడిన మక్తల్ ప్రాంతంలో దినసరి కూలీల సంఖ్య అధికంగా ఉన్నది. వేసవిలో ఉపాధి, ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతున్న క్రమంలో వేపగింజల వల్ల గ్రామీణ ప్రజలు, ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. వేపగింజలతో అనేక రకాల ఔషధాలను, నూనె తయారు చేస్తారు. గ్రామాల్లో విరివిగా వేపచెట్లు పెరుగుతుండడంతో ఎండాకాలం మొత్తం గ్రామీణ ప్రజలు వేపపండ్లను సేకరించి మక్తల్ మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఈ ఏడాది వేపగింజలకు గతంలో కంటే ఎక్కువ ధర పలుకుతుండడంతో కూలీలు పోటీ పడి గింజలను సేకరించి మక్తల్‌కు తీసుకురావడంతో మార్కెట్ అంతా వేపగింజలతో కళకళలాడుతున్నది. ఈక్రమంలో సదరు కూలీలతోపాటు వ్యాపారులకు కాసుల పంట పండుతున్నది. ఇతర పంటలకు విధించే వివిధ రకాల రుసుములు వేపగింజలకు లేకపోవడంతో పూర్తిస్థాయిలో లాభం పొందుతూ చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేపగింజలను కూలీలు ఎన్నో ఏండ్లుగా మక్తల్ మార్కెట్‌కు తీసుకొచ్చి లబ్ధిపొందుతున్నారు.
కొన్నేండ్లుగా మక్తల్ వ్యవసాయ మార్కెట్లో వేపగింజల విక్రయం కొనసాగుతున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా మక్తల్ మార్కెట్‌కు అధికంగా వేపగింజలు వస్తుండడంతో వ్యాపారులు వాటిని కొనుగోలు చేసి బెంగళూరు, కేరళ, తమిళనాడు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రతి ఏడాది వందలకొద్ది లారీల్లో వేప గింజలను బెంగళూరుకు ఎగుమతి చేస్తున్నారు. ఈ ఏడాది వేపగింజలకు రూ.1,800 నుంచి రూ.2,100 వరకు ధర పలుకుతుండడంతో చిరు వ్యాపారులు సంతోషిస్తున్నారు.
ప్రతి ఏడాది ఎండాకాలంలో ఆడవికి వెళ్లి వేపగింజలను సేకరిస్తాను. మక్తల్ మార్కెట్‌కు తీసుకొచ్చి అమ్మితే ఈసారి.. గతేడాది కంటే ఎక్కువ రేటు పలికింది. నేను పడిన కష్టానికి ప్రతిఫలం దక్కింది.
– శారద, గజరందొడ్డి
మాది కర్ణాటక రాష్ట్రం. మా వద్ద ఎక్కువగా వేప చెట్లు ఉండడం వల్ల కూలీలు వేపగింజలను తీసుకొచ్చి మాకు అమ్ముతారు. వారికి ఒక్క సేరుకు రూ.12 చెల్లించి వారి నుంచి నేను కొనుగోలు చేసి మక్తల్ మార్కెట్‌కు తీసుకొచ్చాను. గత మూడు, నాలుగేండ్లకంటే ఈసారి వేపగింజలకు మంచి రేటు వచ్చింది.
– హమీర్ పటేల్, జిన్కెర, యాద్గిర్ జిల్లా
ఎండాకాలంలో కూలిపనులు లేకపోయేవి. ఎండలో వేప గింజలను సేకరించడానికి వె ళ్లి నేను పడిన కష్టానికి మంచి ఫలితం లభించింది. గింజలకు రేటు బాగా రా వడంతో ఎంతో ఆనందంగా ఉంది. నేను తీసుకొచ్చిన వేప గింజలను మక్తల్ మార్కెట్ల అమ్మితే క్వింటాకు రూ.2,130 ధర పలికింది. మొత్తం ఐదు క్వింటాళ్ల పైచిలుకు అమ్మితే రూ.11వేలకు పైనే డబ్బులొచ్చాయి.
– శ్యామలమ్మ, గజరందొడ్డి, మాగనూర్
చిన్నతనంలో మా తండ్రి వేపగింజలను సేకరించే చిరు వ్యాపారిగా ఉండే వారు. ఆయన చూపిన బాటలోనే నేను కూడా వేపగింజలను సేకరించి మక్తల్ మార్కెట్లో విక్రయిస్తున్నా. గతేడాది కంటే ఈసారి రేటు ఎక్కువగా పలుకుతున్నది. నేను తెచ్చిన గింజలు క్వింటాకు ధర రూ.2,100కు పైగా పలకడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
– గోపాల్, రాంపూర్ అల్లి, గుల్బర్గా జిల్లా