జడ్చర్ల, ఫిబ్రవరి 16 : జడ్చర్ల మండలంలోని గంగాపూర్ లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు గత వారం రోజులుగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రథసప్తమి సందర్భంగా చెన్నకేశవస్వామి రథోత్సవం(పెద్దతేరు) నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తు లు వేలాదిగా తరలివచ్చి దాసంగాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కొంతమంది భక్తులు తాము కోరుకున్న కోర్కెలు తీరడంతో స్వామివారికి కోడెలను, వివిధ రకాల కానుకలు సమర్పించారు. నిర్వాహకులు ఆలయ ఆవరణలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. రథోత్సవం సందర్భంగా సాయంత్రం పెద్దతేరును పూ లు, విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించా రు. పెద్దతేరు సందర్భంగా ముందుగా రాత్రి తేరు వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య హోమంతోపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్తులు గోవిందా.. గోవిందా అం టూ రథాన్ని ముందుకు లాగడంతో ఆ ప్రాంతం గోవింద నామస్మరణతో మార్మోగింది. రథోత్సవానికి వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. అయితే శనివారం శకటోత్సవం (బండ్లు తిరుగుట)నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో దీప్తిరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ సమీపంలో వివిధ రకాల దుకాణాలు వెలిశాయి. తినుబండారాలు, చిన్నపిల్లలకు సంబంధించిన ఆటవస్తువులు, గాజులు, మిఠాయిల దుకాణాలు, రంగులరాట్నాల వద్ద పిల్లలు, మహిళల సందడి కనిపించింది.