కొల్లాపూర్, ఆగస్టు 25 : అధిష్టానం తొలి జాబితాలోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం తొలిసారిగా కొల్లాపూర్ నియోజకవర్గంలో బీరం అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించారు. దీంతో బీరం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద ర్యాలీ విజయవంతమైంది. నేరుగా హైదరాబాద్ నుంచి కొత్తకోట వయా వనపర్తి, పాన్‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాల మీదుగా కొల్లాపూర్ పట్టణానికి భారీ కాన్వాయ్‌లో చేరుకున్నారు.
వనపర్తి పట్టణ శివారులోని నాగవరం నుంచి 400కు పైగా కార్లతో ర్యాలీగా దావాజీపల్లితండా వద్ద కొల్లాపూర్ నియోజకవర్గంలోకి అడుగుపెట్టగా ఆయా గ్రామాల్లో నాయకులు పటాకులు కాల్చుతూ స్వాగతం పలికారు. కొల్లాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే కాన్వాయ్ ముందు అభిమానులు నృత్యం చేయగా బీరం ప్రజలకు బీరం అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.