అయిజ, ఏప్రిల్ 25 : తుంగభద్ర జలాశయం 33కొత్త క్రస్ట్‌గేట్ల బిగింపు పూర్తి చేశారు. రూ. 51కోట్ల వ్యయంతో గతేడాది డిసెంబర్లో టీబీ డ్యాం గేట్ల బిగింపు పనులు మొదలు పెట్టిన టీబీ బోర్డు ఇంజినీర్లు ఏప్రిల్ 25 నాటికి బిగింపు పనులు పూర్తి చేశారు. టీబీ బోర్డు చైర్మన్ ఎస్ఎస్ పాండే, కార్యదర్శి రామకృష్ణారెడ్డి పర్యవేక్షణలో కేంద్ర జలసంఘం నిపుణులు, కర్ణాటక, ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ అధికారుల సూచనలు, సలహాలతో బోర్డు అధికారులు గేట్ల బిగింపు చేపట్టారు.
జూన్ నాటికి గేట్ల బిగింపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న బోర్డు ఇంజినీర్లు ఏప్రిల్ 25 నాటికి 33గేట్లు బిగించి మూడు రాష్ర్టాల రైతుల మన్నలు పొందారు. వానలు కురిసేలోగా గేట్లు బిగించి సాగు, తాగునీరు అందించాలనే లక్ష్యంతో పనుల్లో వేగం పెంచామని బోర్డు కార్యదర్శి రామకృష్ణారెడ్డి తెలిపారు. యాసంగిలో పంటల సాగుకు నీరు అందించకపోవడంతో రైతులు నష్టపోయిన విషయం గ్రహించి గేట్ల బిగింపును ముమ్మరం చేశామన్నారు. శనివారం 33 క్రస్ట్‌గేట్లు బిగించి, ట్రయల్ రన్ పూర్తి చేశామన్నారు.
ప్రస్తుతం బిగించిన క్రస్ట్‌గేట్లు 70ఏండ్ల వరకు ఢోకా ఉండదన్నారు. అత్యంత మన్నిక, సాంకేతిక పరిజ్ఞానంతో గేట్లను బిగించామన్నారు. గేట్ల బిగింపు పూర్తి కావడంతో వానకాలంలో టీబీ డ్యాం నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాలకు సాగు, తాగునీటిని విడుదల చేస్తామన్నారు. అనతికాలంలోనే క్రస్ట్‌గేట్లు బిగించిన ఇంజినీర్లు, కార్మికులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎస్ఈ నారాయణ్ నాయక్, ఈఈ చంద్రశేఖర్, ఎస్‌డీవోలు జ్ఞానేశ్వర్, కృష్ణకుమార్, ఎస్వోలు కిరణ్, పంపతి, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.